Heroine Trisha: హీరోయిన్ త్రిషకు క్షమాపణ చెప్పను: మన్సూర్ అలీఖాన్
- త్రిష గురించి తప్పుగా మాట్లాడలేదని సమర్థించుకున్న నటుడు
- తనపై నిషేధం విధించి నడిగర్ సంఘం తప్పు చేసిందని వ్యాఖ్య
- సినిమాల్లో రేప్ చేస్తే నిజంగానే చేసినట్లా? అని సమర్థించుకున్న మన్సూర్ అలీఖాన్
ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ త్రిష పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపిన నటుడు మన్సూర్ అలీఖాన్ వివరణ ఇచ్చారు. త్రిష గురించి తాను తప్పుగా మాట్లాడలేదని, అందుకే క్షమాపణ కోరబోనని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. త్రిషకు క్షమాపణ చెప్పని కారణంగా నడిగర్ సంఘం తనపై నిషేధం విధించడంపై ఆయన స్పందించారు. నిషేధం విధించి నడిగర్ సంఘం తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. వివరణ అడగకుండా, విచారణ జరపకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లు కాదని, సినిమాల్లో రేప్ చేస్తే నిజంగానే చేసినట్లా? అని ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్ను వెనక్కి తీసుకునేందుకు నడిగర్ సంఘానికి 4 గంటలు సమయమిస్తున్నానని డెడ్లైన్ విధించారు. తనకు తమిళనాడు ప్రజల మద్దతు ఉందని, తాను క్షమాపణ చెప్పే వ్యక్తిలా కనిపిస్తున్నానా? అని ప్రశ్నించారు.
వివాదం ఏంటి?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు మన్సూర్ అలీఖాన్ త్రిష పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానని, ‘లియో’ సినిమాలో ఛాన్స్ రావడంతో త్రిషతో కూడా అలాంటి సీన్ ఉంటుందని భావించానని, కానీ సీన్ లేకపోవడంతో బాధగా అనిపించిందని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలే దుమారాన్ని రేపాయి. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో క్షమాపణ చెప్పాలని త్రిష డిమాండ్ చేసింది. ఆమెకు మద్దతుగా పలువురు అగ్రశ్రేణి నటులు స్పందించారు. మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలను క్షమించేది లేదని ఖండించారు.