Stop Clock: వన్డే, టీ20ల్లో కొత్త రూల్ తెస్తున్న ఐసీసీ.. వచ్చే నెల నుంచే అమలు.. బౌలింగ్‌లో మూడుసార్లు అదే పనిచేస్తే ఐదు పరుగుల ఫైన్!
- ‘స్టాప్‌క్లాక్’ పద్ధతిని తీసుకొస్తున్న ఐసీసీ
- ఓవర్‌కు ఓవర్‌కు మధ్య అమలు
- ఓవర్‌కి ఓవర్‌కు మధ్య 60 సెకన్లు దాటితే ఐదు పరుగుల ఫైన్
వైట్‌బాల్ క్రికెట్‌ను పరుగులు పెట్టించేందుకు ఐసీసీ మరిన్ని కొత్త నిబంధనలు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ‘స్టాప్ క్లాక్’ పద్ధతిని ప్రవేశపెడుతోంది. డిసెంబరు నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పురుషుల వన్డే, టీ20 క్రికెట్‌లో తొలుత పరీక్షించనుంది. అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన ఐసీసీ బోర్డ్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఓవర్ల మధ్యలో సమయాన్ని నియంత్రించేందుకు ఈ ‘స్టాప్‌క్లాక్’ పద్ధతిని ఉపయోగిస్తారు. ఓవర్ పూర్తయిన తర్వాత 60 సెకన్లలో మరో ఓవర్ వేసేందుకు జట్టు సిద్ధంగా లేకుంటే దానిని పరిగణనలోకి తీసుకుంటారు. అలా మూడుసార్లు జరిగితే 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు.
ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ ఆలస్యంగా క్రీజులోకి వచ్చాడన్న బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ ఫిర్యాదుతో మాథ్యూస్‌ను ‘టైమ్‌డ్ అవుట్’గా ప్రకటించడం దుమారం రేపింది. టైమ్‌డ్ అవుట్‌పై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ మరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఐసీసీ అంపైర్లవైపే నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బౌలింగ్ వైపు కూడా నిబంధనలు తీసుకొచ్చింది. తొలుత ప్రయోగాత్మకంగా ‘స్టాప్‌క్లాక్’ విధానాన్ని ప్రవేశపెట్టి ఆపై పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది.