Jayaprakash Narayan: పాత పెన్షన్ విధానం కొనసాగిస్తే దేశం నాశనం అయినట్టే: డాక్టర్ జయప్రకాశ్ నారాయణ

India will ruin if OPS system continuous says Jayaprakash Narayan

  • హామీలు ఇచ్చేముందు ఆలోచించాలన్న లోక్‌సత్తా వ్యవస్థాపకుడు
  • ఆలోచించకుండా హామీలిస్తే జాగ్రత్తగా వెనక్కి తీసుకోవాలని సూచన
  • ప్రజలు ప్రశ్నించకుండా కులమతాల చిచ్చు రేపుతున్నారని ఆగ్రహం

పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తే భారతదేశ భవిష్యత్తు సమాధి అయిపోయినట్టేనని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ హెచ్చరించారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా జీవనంలో తానెప్పుడూ అబద్ధాలు చెప్పలేదన్నారు. అధ్యయనం చేయకుండా ఏ విషయంపైనా అవాకులు, చెవాకులు చెప్పనని స్పష్టం చేశారు. గత 75 ఏళ్లుగా ఎన్నో తప్పులు చేశామని, అయితే విధానాల్లో మార్పు రావడం వల్ల, టెక్నాలజీ పెరగడం వల్ల, ప్రపంచం మనపట్ల సద్భావనతో ఉండడం వల్ల మనం ఎదిగే అవకాశం కనిపిస్తోందని అన్నారు.

మనం కనుక మళ్లీ పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)కు మళ్లితే మనం ఎదిగే అవకాశాన్ని కోల్పోయినట్టేనని, అది జీవన్మరణ సమస్య అవుతుందని జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. కాబట్టి హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఆలోచించకుండా హామీ ఇస్తే దానిని వెనక్కి తీసుకోవడమో, మధ్యేమార్గాన్ని అన్వేషించడమో చేయాలని సూచించారు. కడుతున్న పన్నులు ఎటుపోతున్నాయో సామాన్యులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. 

ఈ విషయం గురించి ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు తాత్కాలిక తాయిలాలు, కులం, మతం వంటి వాటిని ఎగదోస్తున్నారని విమర్శించారు. ఎన్నికల పోరాటం ప్రజల కోసమా? ప్రభుత్వంలో ఉన్న కొద్దిమంది బాగుకోసమా? అన్నది తేల్చుకోవాలని జేపీ సూచించారు. తమకేదైనా నష్టం జరిగినప్పుడు సంఘటితంగా ఉన్న మూడునాలుగు శాతం మంది ఒక్కటై పోరాడితే, సంఘటితంగా లేని 97 శాతం మంది నష్టపోతున్నారని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు.

తప్పుడు హామీలు ఇచ్చినప్పుడు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. ఇక్కడ హామీలు ముఖ్యం కాదని.. దేశం, పిల్లల భవిష్యత్తు ముఖ్యమని అన్నారు. ఎవరు ఏమైపోతేనేం నా హామీలు నాకు ముఖ్యమనుకుంటే దేశం నాశనం అయిపోతుందని హెచ్చరించారు. పోరాటం అనేది ప్రభుత్వంలో ఉన్న కొద్దిమంది కోసమా? పన్నులు కట్టే ప్రజల కోసమా? అనేది ఆలోచించాలన్నారు.

  • Loading...

More Telugu News