Gautam Gambhir: ప్రపంచకప్ విజేతపై కైఫ్ వ్యాఖ్యలకు గంభీర్ కౌంటర్.. ఆ వాస్తవాన్ని అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పిన మాజీ
- అత్యుత్తమ జట్టుకు ప్రపంచకప్ దక్కలేదన్న మహ్మద్ కైఫ్
- అత్యుత్తమ జట్టుకే దక్కిందన్న గౌతం గంభీర్
- ఈ విషయంలో సందేహాలు అక్కర్లేదన్న గౌతీ
అత్యుత్తమ జట్టుకు ప్రపంచకప్ దక్కలేదన్న టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సహా పలువురు చేసిన వాదనను మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కొట్టిపడేశాడు. వారి వాదనతో తాను ఏకీభవించబోనని తేల్చి చెప్పాడు. అత్యుత్తమ జట్టే విశ్వవిజేతగా నిలిచిందని, ఇందులో ఎలాంటి సందేహమూ లేదని తేల్చి చెప్పాడు. అత్యుత్తమ జట్టు ప్రపంచ కప్ గెలవలేదని కొందరు చేసిన వ్యాఖ్యలు తన చెవిన పడ్డాయన్న గంభీర్.. నిజాయతీగా చెప్పాలంటే అత్యుత్తమ జట్టే జగజ్జేతగా నిలిచిందన్నాడు.
భారత జట్టు వరుసగా పది మ్యాచులు గెలిచి ఫైనల్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిందని, కానీ ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచుల్లో ఓడినా ఆ తర్వాత వరుసగా 8 మ్యాచుల్లో విజయం సాధించిందన్నాడు. టీమిండియా వరుసగా 10 మ్యాచుల్లో గెలిచినా అసలు మ్యాచ్‌లో పేలవంగా ఆడిందన్నాడు. లీగ్ దశలో ఏ స్థానంలో ఉన్నామన్నది ముఖ్యం కాదన్నాడు. అత్యుత్తమ జట్టే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుందన్న వాస్తవాన్ని అంగీకరించాలని గంభీర్ సూచించాడు.