Himanta Biswa Sharma: వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పిన కారణం ఇదే!
- ఇందిరాగాంధీ పుట్టినరోజున ఆడడంతోనే భారత్ ఓడిపోయిందన్న హిమంత బిశ్వశర్మ
- గాంధీ కుటుంబ సభ్యుల పుట్టిన రోజుల్లో మ్యాచ్‌లు ఆడించొద్దని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నానంటూ వ్యంగ్యాస్త్రాలు
- కాంగ్రెస్ నేత రాహుల్ ‘పనౌటీ’ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన అసోం సీఎం
వరల్డ్ కప్ 2023 లీగ్ దశలో అత్యద్భుతంగా ఆడి ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవ్వడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ ఓటమికి రకరకాల కారణాలు చూపుతూ విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ విశ్లేషణలు కాస్త శ్రుతిమించి రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శల వరకు దారితీశాయి. తాజాగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. ఫైనల్ మ్యాచ్ జరిగిన రోజు ఇందిరాగాంధీ జన్మదినం కావడంతోనే భారత్ ప్రపంచ కప్‌ను కోల్పోయిందని వ్యాఖ్యానించారు.
‘‘మనం అన్ని మ్యాచ్‌లు గెలిచాం. కానీ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయాం. ఆ మ్యాచ్‌లో మనం ఎందుకు ఓడిపోయామా అని నేను ఆరా తీశాను. ఇందిరా గాంధీ పుట్టినరోజున వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడారని కనుగొన్నాను. ఇందిరాగాంధీ జన్మదినాన ఫైనల్స్ ఆడాం, దేశం విఫలమైంది. బీసీసీఐకి నా దగ్గర ఒక సలహా ఉంది. దయచేసి గాంధీ కుటుంబ సభ్యుల పుట్టిన రోజుల్లో టీమిండియా మ్యాచ్‌లు ఆడకూడదు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను’’ అని ఆయన అన్నారు.
కాగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడం రాజకీయ దుమారాన్ని కూడా రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియానికి వెళ్లడంతో దురదృష్టం వెంటాడిందని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. రాహుల్ గాంధీ కూడా ప్రధానిపై విమర్శలకు దిగారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోదీని ప్రస్తావిస్తూ ‘పనౌటీ’ అని రాహుల్ అన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది. ఇదిలావుండగా గత ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాని మోదీతోపాటు హోం మంత్రి అమిత్ షా కూడా స్టేడియానికి వెళ్లిన విషయం తెలిసిందే.