Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్‌లో హార్ధిక్ పాండ్యా ఆడతాడా?.. రిపోర్టులు ఏం చెబుతున్నాయంటే..!
- ఐపీఎల్ నాటికి ఫిట్‌గా ఉంటాడని చెబుతున్న బీసీసీఐ వర్గాలు
- టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా ఐపీఎల్ ఆడతాడని పేర్కొంటున్న రిపోర్టులు
- చీలమండ గాయం కారణంగా వరల్డ్ కప్ నుంచి అర్ధాంతరంగా వైదొలగిన పాండ్యా
- ఇంకా కోలుకోకపోవడంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు దూరం
చీలమండ గాయం కారణంగా వరల్డ్ కప్ 2023 నుంచి అర్ధాంతరంగా వైదొలగిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 2024 ఐపీఎల్ సీజన్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ 17వ సీజన్ నాటికల్లా పాండ్యా ఫిట్‌గా ఉంటాడని, తిరిగి క్రికెట్ ఆడతాడని చెబుతున్నాయి. గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాండ్యా ఐపీఎల్ నాటికి కోలుకుంటాడని బీసీసీఐ వర్గాలు చెప్పినట్టుగా సదరు రిపోర్టులు ప్రస్తావించాయి. కాగా చీలమండ గాయం కారణంగా పాండ్యా ప్రపంచ కప్ 2023లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అంతేకాదు స్వదేశంలో ఆస్ట్రేలియా టీ20 సిరీస్, దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా దూరమయ్యాడు. పాండ్యా కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని, అయితే ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్ సమయానికి ఈ ఆల్-రౌండర్ ఫిట్‌గా ఉంటాడని బీసీసీఐ వర్గాల్లో ఒకరు చెప్పినట్టుగా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
కాగా.. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్ అనంతరం టీమిండియా ఇంగ్లండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. పాండ్యా టెస్టు జట్టులో లేకపోయినప్పటికీ ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న ఐపీఎల్ 2024 సమయానికి అందుబాటులోకి రానున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు సంసిద్ధతే లక్ష్యంగా పాండ్యా ఐపీఎల్‌లో ఆడనున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 4న టీ20 వరల్డ్ కప్ 2024 మొదలుకానుంది. ప్రపంచ కప్ ఫైనల్స్‌లో పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్లతో టీమిండియా ఆడాల్సి వచ్చింది. పాండ్యా టీమ్‌లో ఉంటే బౌలింగ్, బ్యాటింగ్‌లో అదనపు బలం ఉండేదని క్రికెట్ నిపుణులు విశ్లేషించారు.