Boat Accident: విశాఖ బోటు ప్రమాదం: బాధితులకు పరిహారం అందజేత
- చెక్కులు అందజేసిన మంత్రి సీదిరి అప్పలరాజు
- ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణకు రూ.150 కోట్లు మంజూరు
- స్టీల్ బోట్ల తయారీకి 60 శాతం ప్రభుత్వ సబ్సిడీ
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. హార్బర్ లోని 30 బోట్లు మంటల్లో కాలిపోగా మరో 18 బోట్లు పాక్షికంగా కాలిపోయాయి. దీంతో మత్స్యకార కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. రెండు రోజుల వ్యవధిలోనే జిల్లా కలెక్టర్ ఖాతాకు నిధులు జమచేశారు. ఈ మొత్తాన్ని మంత్రి అప్పలరాజు బాధితులకు అందజేశారు.
కాలిపోయిన బోట్ల విలువలో 80 శాతం పరిహారంగా మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. విశాఖ హార్బర్ ప్రమాదానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని గుర్తుచేశారు. అయితే, ఇవేవీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి జగన్ వేగంగా స్పందించారని, వెంటనే నిధులు విడుదల చేసి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారని కొనియాడారు. కళాసీలకు రూ.పది వేల చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. తమ ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణకు రూ.150 కోట్లు మంజూరు చేసిందని, స్టీల్ బోట్ల తయారీకి 60 శాతం సబ్సిడీ అందజేస్తోందని వివరించారు.
అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన 30 బోట్లకు వాటి విలువలో 80 శాతం చొప్పున రూ.6.45 కోట్లు, పాక్షికంగా కాలిన 18 బోట్లు, ఒక వలకు రూ.67 లక్షల పరిహారంగా అందజేసినట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఈ ప్రమాదంలో హమాలీలు, చిరు వ్యాపారులు కూడా నష్టపోయారని గుర్తించి కాలిపోయిన ఒక్కో బోటుకు పది మందికి చొప్పున మొత్తం 490 మందికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.