Deepfake Videos: డీప్ ఫేక్ వీడియోలకు కళ్లెం వేసేందుకు రంగంలోకి కేంద్రం... సోషల్ మీడియా వేదికలకు ఆదేశాలు
- ఇటీవల సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోల కలకలం
- ప్రముఖ సినీ తారల ముఖాలతో అభ్యంతరకర వీడియోలు
- సోషల్ మీడియా వేదికల ప్రతినిధులతో నేడు కేంద్రం సమావేశం
- పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్న అశ్విని వైష్ణవ్
ఇటీవల సోషల్ మీడియా వేదికలపై కనిపించిన కొన్ని డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టించాయి. రష్మిక మందన్న, కాజోల్ వంటి తారల ముఖాలతో రూపొందించిన ఈ వీడియోలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం దుష్ఫలితాల్లో ఒకటైన ఈ డీప్ ఫేక్ మార్ఫింగ్ పై కేంద్రం కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది.
ఇలాంటి తీవ్ర అభ్యంతరకర వీడియోలకు కళ్లెం వేసే క్రమంలో, నేడు పలు సోషల్ మీడియా వేదికల ప్రతినిధులతో ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం ఇప్పటికే ఈ విషయంలో నోటీసులు జారీ చేసింది. తాజా సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. డీప్ ఫేక్ వీడియోలను గుర్తించి వాటిని సమూలంగా కట్టడి చేయాలని స్పష్టం చేసింది. 10 రోజుల్లో దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.
డీప్ ఫేక్ వీడియోల కట్టడి ప్రధాన అజెండాగా కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. డీప్ ఫేక్ వీడియోలు సాంకేతిక పరిజ్ఞానానికి సవాల్ విసురుతున్నాయని, వీటిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు నిబంధనలు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.
ఈ నిబంధనల రూపకల్పన ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉందని వివరించారు. అవసరమైతే డీప్ ఫేక్ వీడియోల కట్టడికి కొత్త చట్టం కూడా తీసుకువస్తామని వెల్లడించారు. లేకపోతే, ఇప్పటికే ఉన్న చట్టాలను సవరించైనా సరే డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేస్తామని ఉద్ఘాటించారు.
సమాజానికి హానికరమైన ఈ డీప్ ఫేక్ టెక్నాలజీని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. డీప్ ఫేక్ వీడియోలపై చర్యలు తీసుకునేందుకు సోషల్ మీడియా వేదికల ప్రతినిధులందరూ ఆమోదం తెలిపారని వివరించారు.