Rajinikanth: 21 ఏళ్ల తర్వాత అదే స్టూడియోలో... రజనీకాంత్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన కమల్ హాసన్

Rajinikanth and Kamal Haasan met in same studio after 21 years
  • ప్రస్తుతం 170వ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్
  • ఇండియన్-2తో బిజీగా ఉన్న కమల్
  • చెన్నైలోని ఓ స్టూడియోలో ఈ రెండు చిత్రాల షూటింగ్
  • ఆత్మీయంగా ముచ్చటించుకున్న రజనీ, కమల్
రజనీకాంత్, కమలహాసన్... పరిచయం అక్కర్లేని పేర్లు ఇవి. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన మహోన్నత నట శిఖరాలు వీళ్లిద్దరూ. ఇరువురి మధ్య చక్కని స్నేహబంధం ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ చిత్రాన్ని పట్టాలెక్కించగా, కమల్ ఇండియన్-2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. 

ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగులు చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలో పక్క పక్క ఫ్లోర్లలోనే జరుగుతున్నాయి. 21 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ చిత్రాలు మళ్లీ ఇదే స్టూడియోలో చిత్రీకరణ జరుపుకుంటుండడం విశేషం. 2002లో రజనీకాంత్ 'బాబా', కమల్ హాసన్ 'పంచతంత్రం' చిత్రాలు ఇదే స్టూడియోలో షూటింగ్ జరుపుకున్నాయి. మళ్లీ ఇన్నాళ్లకు సినిమా చిత్రీకరణ వేళ ఇద్దరూ కలిశారు. 

తన షూటింగ్ స్పాట్‌కి సమీపంలోనే ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌ జరుగుతోందని తెలిసుకున్న రజినీకాంత్.. తన మిత్రుడు కమల్‌హాసన్‌ని షూటింగ్‌ స్పాట్‌లో కలవటానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న విశ్వనటుడు కమల్ హాసన్.. వెంటనే ఉదయం 8 గంటలకే తలైవర్ 170 షూటింగ్ స్పాట్‌కి వెళ్లి ‘నేను నా స్నేహితుడిని కలవడానికి వస్తున్నాను’ అంటూ సూపర్‌స్టార్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వటం విశేషం. 

చిరకాల మిత్రుడు కమల్‌హాసన్‌ను చూసి సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు బాబా, పంచ తంత్రం షూటింగ్స్ ఒకే చోట జరిగినప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు. ఇది జరిగి 21 సంవత్సరాలు అవుతున్నాయి. 

మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరూ కలిశారు. ఈ సందర్భంగా రజనీకాంత్, కమలహాసన్ ల మధ్య ఆత్మీయ క్షణాలు వెల్లివిరిశాయి. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్న ఇరువురు తమ చిత్రాల విషయాలను, అనేక సంగతులను కలబోసుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో తామిద్దరూ కలిసి నటించిన రోజులను గుర్తు చేసుకున్నారు. రజనీ, కమల్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. 

రజనీకాంత్ తన 170వ చిత్రాన్ని టీఈ జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడు. ఇక, కమల్ ఇండియన్-2 చిత్రానికి శంకర్ దర్శకుడన్న సంగతి తెలిసిందే.
Rajinikanth
Kamal Haasan
Shooting
Studio
Chennai
Kollywood

More Telugu News