Chandrababu: మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి... విచారణ వాయిదా
- చంద్రబాబుపై సీఐడీ కేసు
- మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులు ఇచ్చారంటూ చంద్రబాబుపై ఆరోపణలు
- చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
- సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్
- చంద్రబాబు తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది నాగముత్తు
మద్యం అనుమతుల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో నేడు వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో పలు మద్యం కంపెనీలకు చంద్రబాబు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ సీఐడీ ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే.
ఇవాళ విచారణ సందర్భంగా సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించగా... చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ ప్రతిపాదన పంపారని నాగముత్తు వెల్లడించారు. ఎక్సైజ్ కమిషనర్ ప్రతిపాదనను నాటి మంత్రిమండలి కూడా ఆమోదించిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై అప్పటి రెవెన్యూ స్పెషల్ సీఎస్ సంతకాలు కూడా చేశారని నాగముత్తు వివరించారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయం కాదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో, కోర్టు లిఖితపూర్వక వాదనల సమర్పణ కోసం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.