Gujarat: రెండు నగరాలపై ఉగ్రదాడి ప్లాన్ ను భగ్నం చేసిన గుజరాత్ పోలీసులు
- అహ్మదాబాద్, గాంధీనగర్ లపై ఉగ్రదాడికి కుట్ర
- గతంతో పోలిస్తే విధ్వంసం స్థాయి ఎక్కువ ఉండేలా ప్లాన్
- అలీఘర్ యూనివర్శిటీ విద్యార్థుల ప్రమేయం ఉందన్న గుజరాత్ పోలీసులు
గుజరాత్ లోని అహ్మదాబాద్, గాంధీనగర్ లపై ఉగ్రదాడి కుట్రను ఆ రాష్ట్ర పోలీసులు భగ్నం చేశారు. ఈ రెండు నగరాలపై దాడులు చేసేందుకు ఐసిస్ ప్లాన్ చేసింది. ఢిల్లీలోని ఓ రహస్య స్థావరం నుంచి ఐసిస్ ఆపరేటర్ షానవాజ్ అలియాస్ షఫీ ఉజ్జామాను గత నెల పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా... అహ్మదాబాద్, గాంధీనగర్ లతో పాటు గేట్ వే ఆఫ్ ఇండియాపై ఉగ్రదాడులు చేయాలనే విషయం బయటపడింది. ఇప్పటి వరకు జరిగిన ఉగ్రదాడులతో పోలిస్తే విధ్వంసం స్థాయి ఎక్కువ ఉండేలా ఈసారి ప్లాన్ చేసినట్టు తెలిపాడు. ఈ దాడుల్లో అలీఘర్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థుల ప్రమేయం ఉందని గుజరాత్ పోలీసులు చెప్పారు. షానవాజ్ భార్య తొలుత హిందువని, ఆ తర్వాత ఇస్లాం మతంలోకి మారారని తెలిపారు. అలీఘర్ యూనివర్శిటీలోనే ఇద్దరూ కలుసుకున్నారని, అక్కడి నుంచే ఉగ్ర కుట్రలకు పాల్పడ్డారని చెప్పారు.