BRS: ముస్లింలు, హిందువులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి రెండు కళ్లు: సీఎం కేసీఆర్
- తాను బతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగానే ఉంటుందన్న తెలంగాణ సీఎం
- బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ముస్లిం యువత కోసం ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ
- ఆలోచించుకొని ఓటు వేయాలని అభ్యర్థన
- మహేశ్వరం నియోజకవర్గంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకోవడంతో పార్టీలు ఉద్ధృతంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. సీఎం కేసీఆర్ గురువారం మహేశ్వరం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ముస్లిం యువత కోసం ప్రత్యేకంగా ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్‌కు దగ్గరలో ఈ పార్క్ వస్తుందని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం శాంతియుతంగా ఉందని, అన్ని వర్గాల అభివృద్ధికి పార్టీ కృషి చేస్తుందని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాతే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముస్లింలు, హిందువులు రెండు కళ్లుగా భావించామని కేసీఆర్ అన్నారు. ముస్లింలకు పింఛన్లు, ముస్లిం విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూళ్లను ఓపెన్ చేశామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల కోసం 10 ఏళ్లలో రూ.2000 కోట్లు వెచ్చిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12,000 కోట్లు ఖర్చు చేసిందని కేసీఆర్ అన్నారు. సాగు, తాగు నీరు లేక తెలంగాణ గతంలో ఇబ్బందులను ఎదుర్కొనేదని, ప్రస్తుతం ఇంటింటికి కుళాయి నీళ్లు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం 24 గంటల కరెంటు ఉంటుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రస్తావించారు. వ్యవసాయానికి రైతుబంధు ఇస్తున్నామని పేర్కొన్న కేసీఆర్.. రైతుబంధుకు ఇచ్చే డబ్బుల్ని వృథా అని కాంగ్రెస్ విమర్శిస్తోందని మండిపడ్డారు. ప్రజలు ఆలోచించుకుని ఓటేయాలని, మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని ఓటర్లను కేసీఆర్ అభ్యర్థించారు.