Ohio: అమెరికాలో భారతీయ యువకుడి హత్య.. కారులో ఉండగా తుపాకీతో కాల్పులు
- ఒహాయో రాష్ట్రంలో ఘటన
- యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో పీహెచ్డీ చేస్తున్న ఆదిత్య అడ్లఖా
- నవంబర్ 8న ఆదిత్యపై కాల్పులు
- యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో చికిత్స పొందుతూ నవంబర్ 18న మృతి
అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో కాల్పులకు గురైన భారతీయ విద్యార్థి ఆదిత్య అడ్లఖా ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో పీహెచ్డీ చేస్తున్న ఆదిత్యపై నవంబర్ 8న హత్యాయత్నం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు ఆదిత్య కారు వెస్టర్న్ హిల్స్ వయాడక్ట్ వద్ద కనిపించింది. గోడకు ఢీకొన్న కారులో ఆదిత్య విగతజీవిగా కనిపించాడు. కారుపై పలుమార్లు కాల్పులు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కిటికీ అద్దానికి మూడు బుల్లెట్ రంధ్రాలు కూడా గుర్తించారు.
కాగా, బాధితుడు యూనివర్సిటీ మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 18న మృతి చెందాడు. ఆదిత్య మరణ వార్త విని అతడి స్నేహితులు, బంధువులు, యూనివర్సిటీ వర్గాలు తీవ్ర విచారంలో మునిగిపోయాయి. ఆదిత్య ఎంతో చురుకైన వ్యక్తి అని సిన్సినాటీ మెడికల్ కాలేజీ డీన్ విచారం వ్యక్తం చేశారు. అల్సరేటివ్ కోలైటిస్పై పరిశోధన చేస్తున్న ఆదిత్యకు గతేడాది స్కాలర్షిప్ కూడా లభించింది. 2025లో అతడి పీహెచ్డీ పూర్తవ్వాల్సి ఉండగా ఇంతలోనే దారుణం జరిగిపోయింది.