Nara Lokesh: జగన్‌ను సైకో అని తాము ఎందుకు అంటామో ఉదాహరణలతో చెప్పిన లోకేశ్
- సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడిన లోకేశ్
- తాము కట్టిన సచివాలయంలో కూర్చుని ఇదేం రాజధాని అంటారన్న టీడీపీ యువనేత
- వేలకోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమేస్తున్నారని ఆగ్రహం
- మరో మూడు నెలల్లో ఎక్స్పైరీ డేట్ వస్తుందని హెచ్చరిక
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాము ఊరికే సైకో అని పిలవడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ప్రజా రాజధాని అమరావతిలో టీడీపీ కట్టిన సచివాలయంలో కూర్చుని ఇదేం రాజధాని అంటావని, విశాఖను రాజధానిని చేస్తానని అంటావని జగన్‌పై ఫైరయ్యారు. కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ వ్యవస్థల్ని బెదిరించి దొడ్డిదారిన ప్రభుత్వ కార్యాలయాలు తరలించేందుకు జీవోలు ఇప్పిస్తావని ఆరోపించారు.
ఐటీ అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం కట్టిన మిలీనియం టవర్స్‌ను ఖాళీ చేయిస్తావు, వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమేస్తావు, వేలాదిమందికి ఉద్యోగాలు లేకుండా చేస్తావు అని దుమ్మెత్తి పోశారు. కైలాసగిరిని నాశనం చేశావు.. విశాఖను విధ్వంసం చేసి ఆ శిథిలాలపై కూర్చుని ఏం చేస్తావు సైకో జగన్? అని ప్రశ్నించారు. ఇంతా చేస్తే నీ పాలన మరో మూడు నెలల్లోనే ఎక్స్పైరీ డేట్‌కు చేరుకుంటుందని, మూడు నెలల ముచ్చట కోసం వేలకోట్లు తగలేస్తున్న నిన్ను సైకో అనే అనాలని లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.