Sailajan: వలస కార్మికురాలి నాలుగు నెలల పసిపాపకు స్తన్యమిచ్చిన కేరళ మహిళా పోలీసు.. కురుస్తున్న ప్రశంసలు
- గుండెలో వాల్వ్ సమస్యతో ఆసుపత్రిలో చేరిన కార్మికురాలు
- ఆసుపత్రిలో ఆకలితో అల్లాడిపోయిన ఆమె నలుగురు పిల్లలు
- పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ఆహారం అందించిన వైనం
- కానిస్టేబుల్ శైలజన్పై దేశవ్యాప్తంగా ప్రశంసలు
ఆమె పేరు ఆర్య శైలజన్. కేరళలోని కొచ్చిలో ఓ మహిళా పోలీసు అంతే. ఆమె గురించి అంతకుమించి చెప్పుకోవడానికేం లేదు. కానీ ఇప్పుడు శైలజన్ గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది. అంతగా ఆమె చేసిన ఘనకార్యం ఏమిటనేదే మీ ప్రశ్న అయితే.. ఈ వార్తను చదివేయాల్సిందే.
పోలీస్ కంట్రోల్ రూముకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. హార్ట్‌లో వాల్వ్ సమస్యతో ఓ వలస కార్మికురాలు ప్రభుత్వాసుపత్రిలో చేరిందని, ఆమె నలుగురు చిన్నారులు కూడా అక్కడే ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని, వారి వద్ద మరెవరూ లేరనేది ఆ ఫోన్‌కాల్ సారాంశం. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న సిబ్బంది ఆ చిన్నారులను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
వారిలో ముగ్గురి వయసు 13, 5, 2 ఏళ్లు కాగా, మరో పసిపాప వయసు నాలుగు నెలలు. వారందరూ ఆకలితో అలమటించిపోతున్నారు. ఆ అమ్మాయిని చూసి గుండె తరుక్కుపోయిన శైలజన్ వెంటనే తన పై అధికారికి ఆ విషయం చెబుతూ ఆ చిన్నారికి తాను పాలిస్తానని చెప్పారు. అందుకు ఆయన కూడా అంగీకరించడంతో వెంటనే ఆమె పాలుపట్టి ఆ పాప ఆకలి తీర్చారు.
తనకు 9 నెలల పాప ఉందని పేర్కొన్న శైలజ.. ఏడుస్తున్న చిన్నారికి పాలుపట్టి ఆకలి తీర్చినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. పాట్నాకు చెందిన వలస కార్మికురాలికి మొత్తం ఐదుగురు సంతానం కాగా, ఒకరు పాట్నాలోనే ఉన్నారు. ఆమె భర్త ఓ నేరంపై కొచ్చిలోనే జైలులో ఉన్నాడు. వలస కార్మికురాలి పాపకు తన స్తన్యమిచ్చి ఆకలి తీర్చిన శైలజన్పై ప్రశంసలు కురుస్తున్నాయి.