Wasim Akram: టీ20 వరల్డ్ కప్ కు టీమిండియాలో వాళ్లిద్దరూ కూడా ఉండాలి: వసీం అక్రమ్
- వచ్చే ఏడాది జూన్ లో టీ20 వరల్డ్ కప్
- టీమిండియాలో కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఉండాలన్న వసీం అక్రమ్
- వాళ్లిద్దరి అనుభవం జట్టుకు ఎంతో అవసరమని వ్యాఖ్య
- కేవలం యువ ఆటగాళ్ల మీదే ఆధారపడలేమని వివరణ
వన్డే వరల్డ్ కప్ ముగియడంతో, ఇప్పుడందరూ వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నారు. పాకిస్థాన్ స్వింగ్ లెజెండ్ వసీం అక్రమ్ కూడా టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ఎంపికపై తన అభిప్రాయాలను వెల్లడించాడు.
ఈ మినీ వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఉండాలని అన్నాడు. "మరికొన్ని నెలల్లోనే టీ20 వరల్డ్ కప్ జరగనుంది. నేనైతే ఆ ఇద్దరిని జట్టులోకి తీసుకుంటాను. రోహిత్ శర్మ, కోహ్లీ టీమిండియాకు ప్రధాన ఆటగాళ్లు. అందులో ఎలాంటి సందేహం లేదు. టీ20ల్లో ఆడేటప్పుడు కొంచెం అనుభవజ్ఞుల అవసరం కూడా ఉంటుంది. కేవలం యువ ఆటగాళ్ల మీదే ఆధారపడలేం" అని అక్రమ్ వివరించాడు.
గత కొన్ని నెలలుగా టీమిండియా టీ20 జట్టును హార్దిక్ పాండ్యా నడిపిస్తున్నాడు. రోహిత్ శర్మ టెస్టులు, వన్డేల్లోనే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఇటీవల బీసీసీఐ... టీ20ల్లో కొనసాగడంపై నిర్ణయం తీసుకోవాలని కోహ్లీ, రోహిత్ లకు సూచించింది. అయితే టీ20ల్లో కొనసాగడమా, వద్దా అనేది పూర్తిగా వాళ్ల నిర్ణయానికే వదిలేస్తున్నట్టు బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో అక్రమ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్ కప్ లోనూ రోహిత్ శర్మే టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించాలని, కోహ్లీ కూడా ఈ టోర్నీలో ఆడాలని గంభీర్ పేర్కొన్నాడు.