Ireland: ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ లో కత్తిపోట్ల ఘటన... తీవ్రస్థాయిలో అల్లర్లు
- డబ్లిన్ లో ఓ పాఠశాల వద్ద కత్తితో విరుచుకుపడిన దుండగుడు
- నలుగురికి గాయాలు
- ఎలాంటి ఉగ్రవాద కోణం లేదంటున్న పోలీసులు
- తీవ్ర ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చిన జనాలు
ఐర్లాండ్ లో కత్తిపోట్ల ఘటన తీవ్ర అల్లర్లకు దారితీసింది. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ లో ఓ పాఠశాల వద్ద ఓ వ్యక్తి కత్తితో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, ఓ మహిళకు గాయాలయ్యాయి. ఇందులో ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని డబ్లిన్ పోలీసులు చెబుతున్నారు. కత్తిపోట్ల ఘటనపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన వెల్లడించారు.
అయితే ఈ కత్తిపోట్ల ఘటన నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు ఓ బస్సును, కారును, ట్రామ్ ను అగ్నికి ఆహుతి చేశారు. విధుల్లో ఉన్న ప్రత్యేక పోలీసు బలగాలపై చేతికి అందిన వస్తువులను విసిరారు.
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి జాతీయత ఏంటన్నది ఇంకా తెలియరాకపోయినప్పటికీ, అతడు ముస్లిం వ్యక్తి అనే ప్రచారం జరుగుతోంది. ప్రజల ఆగ్రహానికి ఈ అంశమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అల్లర్ల నేపథ్యంలో డబ్లిన్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించారు. గర్భవతులు ఆసుపత్రులకు వెళ్లడం తప్పనిసరి అయితేనే బయటికి రావాలని స్పష్టం చేశారు.