Hydrogel: రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునే బాధలు ఇక ఉండవు... ఈ పద్ధతిలో ఏడాదికి 3 చాలట!
- కొత్తగా హైడ్రోజెల్ వ్యవస్థను అభివృద్ధి చేసిన పరిశోధకులు
- ఔషధాలను శరీరంలోకి నిదానంగా విడుదల చేసే వ్యవస్థ
- ప్రస్తుతానికి ఎలుకలపై ప్రయోగాలు విజయవంతం
- త్వరలోనే పందులపై ప్రయోగాలు... రెండేళ్లలో మానవులపై క్లినికల్ ట్రయల్స్
ప్రపంచంలో అత్యధిక మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. ఇప్పటి జీవనశైలిని బట్టి ఇది వయసుతో సంబంధం లేకుండా బాధిస్తోంది. మధుమేహ బాధితుల్లో కొందరికి క్రమం తప్పకుండా మాత్రలు తీసుకుంటే సరిపోతుంది. మరికొందరికి రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం తప్పనిసరి.
అయితే రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునే వారికి పరిశోధకులు శుభవార్త చెప్పారు. ఇకపై రోజూ మధుమేహం ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదని, తాము అభివృద్ధి చేసిన హైడ్రోజెల్ ఔషధ వ్యవస్థ కారణంగా ఏడాదికి 3 పర్యాయాలు తీసుకుంటే చాలని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, బరువును నియంత్రణలో ఉంచే ఒజెంపిక్, మౌంజారో, ట్రూలిసిటీ, విక్టోజా తదితర ఔషధాలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు.
ఈ వ్యవస్థ కారణంగా, ఆయా ఔషధాలను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి తీసుకుంటే సరిపోతుందని వివరించారు. ఈ హైడ్రోజల్ వ్యవస్థ సదరు ఔషధాలను నిదానంగా శరీరంలోకి విడుదల చేస్తుంటుంది. ఈ ప్రక్రియ కొన్ని నెలల పాటు కొనసాగుతుంది. తద్వారా రోజూ బయటి నుంచి శరీరంలోకి ఔషధాలను తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
హైడ్రోజెల్ అనేది కొత్తదేమీ కాదు... ప్రస్తుతం చాలామంది హైడ్రోజెల్ తో రూపొందించిన కాంటాక్ట్ లెన్సులను ధరిస్తున్నారు. హైడ్రోజెల్ అనేది నానోపార్టికల్స్ తో కూడిన పదార్థం. శరీరంలోకి ప్రవేశించాక పాలిమర్స్ తో ఈ నానోపార్టికల్స్ బలహీన బంధాలను ఏర్పరచుకుని ఓ జెల్ మాదిరిగా ఏర్పడతాయి. ఇవి విడిపోవడానికి కొన్ని వారాల సమయం పడుతుంది.
ఇలా రూపొందే పాలిమర్ శృంఖలాలు, నానోపార్టికల్స్ పొర నుంచి హైడ్రోజెల్ ఏర్పడుతుంది. శరీరంలోకి ఇంజెక్ట్ చేసిన ఔషధాలను ఈ పొర అడ్డుకుంటుంది. ఈ పొర నిదానంగా కరిగిపోయే కొద్దీ... ఔషధం కొద్దికొద్దిగా విడుదల అవుతుంది. తద్వారా దీర్ఘకాలం పాటు శరీరంలో ఔషధం పనిచేస్తుంటుంది.
ప్రస్తుతానికి ఈ హైడ్రోజెల్ ను ప్రయోగశాలలో ఎలుకలపై ప్రయోగించి చూడగా, చక్కని ఫలితాలు వచ్చాయి. తదుపరి దశలో ఈ వ్యవస్థను పందులపై పరీక్షించనున్నారు. పందుల్లో చర్మం, ఎండోక్రైన్ వ్యవస్థలు దాదాపు మానవుల వ్యవస్థలను పోలి ఉంటాయి. పందులపై ప్రయోగాలు విజయవంతం అయితే, మరో రెండేళ్లలో మానవులపై క్లినికల్ ట్రయల్స్ ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు.