barrelakka shirisha: బర్రెలక్క శిరీషకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు
- రెండు రోజుల క్రితం శిరీష, ఆమె సోదరుడిపై దుండగుల దాడి
- తమకు రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన శిరీష
- గుర్తింపు ఉన్న పార్టీలకే కాదు... అభ్యర్థులెవరికైనా భద్రత కల్పించాలని ఆదేశాలు
- భద్రత కల్పించాలని ఆదేశించిన హైకోర్టు
కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కకు భద్రత కల్పించాలని హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తనపై దాడి నేపథ్యంలో భద్రత కల్పించాలని కోరుతూ శిరీష హైకోర్టును ఆశ్రయించారు. రక్షణ కల్పించాలన్న ఆమె పిటిషన్‌తో ఏకీభవించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆమెకు భద్రత కల్పించాలని ఆదేశించింది. కార్లు చెక్ చేయడంతో సరిపెట్టవద్దని, అభ్యర్థులకు కూడా భద్రత కల్పించాలని సూచించింది. స్వతంత్ర అభ్యర్థులకు సెక్యూరిటీ ఇవ్వకుంటే.. కేంద్రబలగాలను దింపుతామని కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కేవలం గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇవ్వడం కాదని, ప్రాణభయం ఉన్న అభ్యర్థులు ఎవరికైనా భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. అభ్యర్థులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని హైకోర్టు తెలిపింది. తెలంగాణ డీజీపీ, ఎన్నికల కమిషన్ కలిసి శిరీషకు భద్రత కల్పించాలని ఆదేశించింది.
శిరీష నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమె, ఆమె సోదరుడిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె సోదరుడికి గాయాలయ్యాయి. దాడి నేపథ్యంలో ఆమె రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు.