Prophet Muhammad: బస్సులో కండక్టర్‌తో గొడవ.. మహ్మద్ ప్రవక్తను అవమానించాడంటూ క్లీవర్‌తో దాడిచేసిన ఇంజినీరింగ్ విద్యార్థి
- ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఘటన
- తీవ్రంగా గాయపడిన కండక్టర్
- బస్సు దిగి కాలేజీలోకి వెళ్లి దాక్కున్న నిందితుడు
- తప్పించుకునే ప్రయత్నం చేయగా కాళ్లపై కాల్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మహ్మద్ ప్రవక్తను అవమానించడం వల్లే దాడిచేశానంటూ వీడియో
బస్సులో టికెట్ కోసం జరిగిన గొడవలో 20 ఏళ్ల యువకుడు బస్సు కండక్టర్‌పై పదునైన ఆయుధంతో దాడిచేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిందీ ఘటన. కండక్టర్‌పై దాడిచేసిన విషయాన్ని యువకుడు ఓ వీడియోలో అంగీకరించాడు. అయితే, మహ్మద్ ప్రవక్తను కండక్టర్ కించపరచడం వల్లే దాడిచేసినట్టు ఆరోపించాడు. నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు అతడి కాళ్లపై కాల్చి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. నిందితుడిని లారెబ్ హష్మీగా గుర్తించారు. టికెట్ ధర విషయంలో కండక్టర్ హృషికేష్ విశ్వకర్మ (24)తో బస్సులో గొడవ జరిగింది. ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న హష్మి, విశ్వకర్మపై పదునైన ఆయుధంతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం బస్సు నుంచి దూకి కాలేజీ క్యాంపస్‌లోకి పారిపోయాడు.
ఆ వెంటనే కాలేజీలోనే ఓ వీడియో చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. మహ్మద్ ప్రవక్తను కండక్టర్ దూషించడం వల్లే దాడిచేసినట్టు అందులో పేర్కొన్నాడు. అంతేకాదు, కండక్టర్‌పై దాడికి ఉపయోగించిన క్లీవర్‌ను కూడా చూపించాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్ పేర్లను కూడా ప్రస్తావించాడు. వైరల్ అవుతున్న మరో వీడియోలో చేతిలో క్లీవర్ పట్టుకుని హష్మీ పరిగెడుతున్నాడు. బాధిత కండక్టర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన తర్వాత కాలేజీలో దాక్కున్న నిందితుడు హష్మీని పోలీసులు అరెస్ట్ చేశారు.