Amit Shah: కేసీఆర్ పాలనలో తెలంగాణ దివాలా తీసింది: అమిత్ షా విమర్శలు

KCR govt is corrupted says Amit Shah

  • బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను నాశనం చేశారన్న అమిత్ షా
  • అవినీతి తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శ
  • బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడూ ఒకటేనని వ్యాఖ్య

పదేళ్ల పాలనలో అవినీతి తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. 1,200 మంది బలిదానాలతో తెలంగాణ ఏర్పడితే... రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నారు. లక్ష రుణ మాఫీ చేయలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఉద్యోగాలను భర్తీ చేయలేదని విమర్శించారు. ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ ఆ హామీని నిలుపుకోలేదని అమిత్ షా విమర్శించారు. రాష్ట్రంలో వందల కోట్ల గ్రానైట్ కుంభకోణం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఎన్నికల ముందు వేర్వేరు కండువాలతో వస్తారని... ఎన్నికలయ్యాక కలిసిపోతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా బీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటు వేసినట్టేనని చెప్పారు. 

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి ఉండదని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తామని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ఎన్నికలు తెలంగాణకు అవసరమని చెప్పారు. తెలంగాణ ప్రజల ఓటు మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News