Ken Ohm: చంద్రుడిపైకి తన డీఎన్ఏను పంపిస్తున్న రిటైర్డ్ ప్రొఫెసర్
- చంద్రుడి దక్షిణ ధ్రువానికి తన డీఎన్ఏను పంపిస్తున్న కెన్ ఓమ్
- సెలెస్టిస్ అనే సంస్థ ద్వారా అంతరిక్షంలోకి డీఎన్ఏ
- తన డీఎన్ఏతో మానవ క్లోనింగ్ చేయాలని కెన్ ఓమ్ ఆకాంక్ష
- అంతరిక్ష జూలో తన ప్రతిరూపాన్ని ఉంచాలన్నది ఆయన అభిమతం
అమెరికాకు చెందిన ఓ రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ కోరిక వింటే ఆశ్చర్యపోతారు. తాను చనిపోయాక తన డీఎన్ఏను చంద్రుడిపైకి పంపించాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ రిటైర్డ్ ప్రొఫెసర్ పేరు కెన్ ఓమ్. తన డీఎన్ఏను చంద్రుడి దక్షిణ ధ్రువానికి పంపించాలని ఆయన భావిస్తున్నారు.
ఆ డీఎన్ఏను ఉపయోగించి క్లోనింగ్ ద్వారా తనలాంటి వ్యక్తినే రూపొందించి, ఆ వ్యక్తిని అంతరిక్ష జూలో మానవ నమూనాగా ప్రదర్శించాలన్నది కెన్ ఓమ్ ఉద్దేశం. మానవుడు ఇలా ఉంటాడు అని గ్రహాంతర జీవులు చూసేందుకు వీలుగా కెన్ ఓమ్ మహాశయుడు ఈ ఏర్పాటు చేస్తున్నారట.
ఆయన వయసు ప్రస్తుతం 86 ఏళ్లు. తన వయసు పైబడిందని, చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పే కెన్ ఓమ్... ఈ రోజుల్లో మానవ క్లోనింగ్ అసాధ్యమేమీ కాదని, స్టార్ వార్స్ సినిమాల్లోని రిపబ్లిక్ ఆర్మీ కూడా క్లోనింగ్ ద్వారా ఏర్పడినదే కదా అని సెలవిస్తున్నారు.
ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ గతంలో బేస్ బాల్ ఆటగాడు, జావెలిన్ త్రోయర్ కూడా. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1960 దశకంలో చేపట్టిన అపోలో రోదసి యాత్రలో తాను కూడా వ్యోమగామిగా పాల్గొనాలని ఉవ్విళ్లూరానని, కానీ, తన ఎత్తు కారణంగా తిరస్కరించారని కెన్ ఓమ్ వివరించారు. కాగా, తన డీఎన్ఏను సెలెస్టిస్ అనే సంస్థ ద్వారా చంద్రుడిపైకి పంపించనున్నారు. కెన్ ఓమ్ తో పాటు మరికొందరు కూడా తమ డీఎన్ఏను రోదసిలోకి పంపిస్తున్నారు.
భూమండలం నుంచి వివిధ వస్తువులను రోదసిలోకి తీసుకెళ్లే సంస్థగా సెలెస్టిస్ కు పేరుంది. ఈ సంస్థ రూ.2 లక్షల నుంచి వివిధ ధరల శ్రేణిలో వస్తువులను, అస్థికలను రోదసిలోకి ఓ రాకెట్ ద్వారా తీసుకెళుతుంటుంది. 1994 నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న సెలెస్టిస్ సంస్థ ఇప్పటివరకు 17 పర్యాయాలు రోదసిలోకి యాత్రలు చేపట్టింది.
వచ్చే క్రిస్మస్ సందర్భంగా చంద్రుడిపైకి రాకెట్ ను ప్రయోగిస్తున్న సెలెస్టిస్ మరికొన్ని వస్తువులను, పలువురి డీఎన్ఏలను అంతరిక్షంలోకి రవాణా చేయనుంది. ఈ రాకెట్ కేప్ కెనవరాల్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.