Mohammed Shami: కెరీర్ తొలినాళ్లలో ఎదురైన బాధాకరమైన అనుభవం గురించి వెల్లడించిన షమీ
- వరల్డ్ కప్ లో బ్యాట్స్ మన్లకు సింహస్వప్నంలా షమీ
- టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న బెంగాల్ పేసర్
- షమీ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్
- దిగ్భ్రాంతికర సంఘటనతో సొంత రాష్ట్రం వదిలి వెళ్లిన షమీ
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వరల్డ్ కప్ లో చేసిన బౌలింగ్ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడు షమీనే. వరల్డ్ కప్ లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చినా, నిప్పులు చెరిగే బౌలింగ్ ప్రదర్శనతో హేమాహేమీ బ్యాట్స్ మన్లను పెవిలియన్ కు తిప్పి పంపాడు.
గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న షమీ... కెరీర్ తొలినాళ్లలో ఎంతటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వాస్తవానికి మహ్మద్ షమీ ఉత్తరప్రదేశ్ కు చెందినవాడు. అయితే ఓ సంఘటన కారణంగా బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాల్సి వచ్చింది. సొంత రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఎందుకు రావాల్సి వచ్చిందనేది షమీ తాజాగా ఓ కార్యక్రమంలో వెల్లడించాడు.
"కెరీర్ మొదట్లో ఉత్తరప్రదేశ్ రంజీ టీమ్ సెలక్షన్స్ కు రెండు సార్లు వెళ్లాను. నా బౌలింగ్ బాగానే ఉందని చెప్పేవారు... కానీ టీమ్ లో మాత్రం చోటిచ్చేవాళ్లు కాదు. దాంతో నా సోదరుడు అప్పటి యూపీ క్రికెట్ సంఘం చీఫ్ వద్దకు నన్ను తీసుకెళ్లాడు. నా సోదరుడ్ని ఎందుకు సెలెక్ట్ చేయడం లేదు అని అతడ్ని అడిగాడు. అందుకు ఆ క్రికెట్ సంఘం చీఫ్ చెప్పిన సమాధానం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
"నేను కూర్చున్న కుర్చీని కదపగలిగితే మీ బ్రదర్ సెలెక్ట్ అయినట్టే... అతడి కెరీర్ బాగుంటుంది... నా కుర్చీని కదపలేకపోతే... ఇక అంతే సంగతులు" అని ఆ చీఫ్ అన్నాడు. దాంతో నా సోదరుడికి బాగా కోపం వచ్చింది. "కుర్చీని కదపడం కాదు... ఎత్తి కిందపడవేయగల బలవంతుడ్ని కూడా... మా వాడిలో ప్రతిభ ఉందనుకుంటే సెలెక్ట్ చేయండి... లేకపోతే లేదు" అని గట్టిగా మాట్లాడాడు.
అందుకు ఆ చీఫ్ బదులిస్తూ... "ఇక్కడ బలవంతులకు స్థానం లేదు... బలంగా ఉండేవాళ్లు ఇక్కడ పనికిరారు" అన్నాడు. దాంతో ఇద్దరం బయటికి వచ్చేశాం. నా దరఖాస్తు ఫారంను నా సోదరుడు అక్కడికక్కడే చించివేశాడు. ఇకపై నువ్వు ఎప్పటికీ ఉత్తరప్రదేశ్ జట్టుకు ఆడొద్దు అని స్పష్టం చేశాడు. ఆ తర్వాత నుంచి నేను బెంగాల్ టీమ్ తరఫున ఆడడం మొదలుపెట్టాను" అంటూ షమీ వివరించాడు.
33 ఏళ్ల షమీ తన కెరీర్ లోనే ప్రస్తుతం అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తున్నాడు. షమీ ఇప్పటివరకు 64 టెస్టులాడి 229 వికెట్లు, 101 వన్డేల్లో 195 వికెట్లు తీశాడు. 23 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల్లో 24 వికెట్లు పడగొట్టాడు.