Pneumonia: చైనాలో న్యుమోనియా కేసుల ఉద్ధృతిని గమనిస్తున్నాం: కేంద్రం
- చైనాలో మరో వైరస్ వ్యాపిస్తోందంటూ అంతర్జాతీయంగా కలకలం
- చైనాలో న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయని కథనాలు
- ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయంటూ ప్రచారం
- అప్రమత్తంగానే ఉన్నామన్న భారత కేంద్ర ప్రభుత్వం
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా చెడ్డపేరు మూటగట్టుకున్న చైనా... ఇప్పుడు మరోసారి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా చైనాలో న్యుమోనియో తరహా కేసులు విపరీతంగా నమోదవుతుండడమే అందుకు కారణం.
చైనాలోని ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయని, రోగ లక్షణాలు న్యుమోనియాను పోలి ఉన్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. కాగా, చైనా ఆసుపత్రుల్లో ఈ తరహా లక్షణాలతో చేరుతున్న వారిలో పిల్లలే అత్యధికంగా ఉన్నారని ఆయా కథనాల్లో పేర్కొన్నారు. దీనిపై భారత కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
చైనాలో న్యుమోనియా తరహా కేసుల తీవ్రతను గమనిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రం అప్రమత్తంగానే ఉందని స్పష్టం చేశారు. చైనాలో న్యుమోనియా కేసుల ఉద్ధృతిని ఐసీఎంఆర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు వివరించారు. ఆ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏదేమైనా భారత్ కు న్యుమోనియా ముప్పు తక్కువేనని నిన్న ఓ ప్రకటనలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా, చైనాలో కొత్త వైరస్ వ్యాపిస్తోందని, ఆసుపత్రుల్లో రోగుల చేరిక ఎక్కువవుతోందంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. చైనాలో కొత్త వైరస్ లేవీ వ్యాపించడంలేదని ఆ దేశ ప్రభుత్వం చెప్పినట్టు డబ్ల్యూహెచ్ఓ వివరణ ఇచ్చింది.
చైనా అంటువ్యాధుల నియంత్రణ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని, అక్కడి ఆసుపత్రుల్లో రోగుల చేరిక సాధారణంగానే ఉందని, అసాధారణ పరిస్థితులేవీ లేవని తమకు సమాచారం అందిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.