Parimal Baidya: ఇన్ స్టా రీల్స్ చేస్తూ పరిచయాలు పెంచుకుంటోందని భార్యను హత్య చేసిన తాపీ మేస్త్రి
- కోల్ కతాలో ఘటన
- ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ఫాలోవర్లను సంపాదించుకున్న అపర్ణ
- కొందరితో నిత్యం చాటింగ్... ఓ వ్యక్తితో తరచుగా ఫోన్ సంభాషణ
- భార్య వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించిన భర్త పరిమళ్ బైద్య
- అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో గొంతు కోసి హత్య
సోషల్ మీడియా ద్వారా ప్రయోజనాలు పొందేవారితో పాటు, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసేవాళ్లు కూడా ఉంటారు. సామాజిక మాధ్యమాల విస్తృతి వ్యక్తిగత జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న ఘటనలు అనేక చోట్ల జరిగాయి.
తాజాగా, కోల్ కతాలో ఓ తాపీ మేస్త్రి తన భార్యను దారుణంగా హతమార్చాడు. అందుకు కారణం ఆమె ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ, పలువురితో పరిచయాలు పెంచుకోవడమే. ఆమె పేరు అపర్ణ. ఆమె భర్త పేరు పరిమళ్ బైద్య. వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
35 ఏళ్ల అపర్ణ తరచుగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ, అనేకమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. వారిలో కొందరితో నిత్యం చాటింగ్ చేస్తుండేది. ముఖ్యంగా, ఓ రుణ మంజూరు సంస్థకు చెందిన ఉద్యోగితో ఫోన్ లో మాట్లాడుతుండేది. అపర్ణ వైఖరిని భర్త పరిమళ్ బైద్య తీవ్రంగా వ్యతిరేకించేవాడు. ఆమెకు అక్రమ సంబంధం ఉందని అనుమానించేవాడు. దాంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. అప్పుడప్పుడు పుట్టింటికి వెళుతుండేది.
ఆమె తన పద్ధతి మార్చుకోకపోవడంతో భర్త గొంతు కోసి చంపేశాడు. అనంతరం అక్కడ్నించి పరారయ్యాడు. కుమారుడు ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి అపర్ణ రక్తపుమడుగులో పడి ఉంది. ఆ అబ్బాయి సమాచారం అందించడంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న పరిమళ్ బైద్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అపర్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.