Ambati Rayudu: 2019 నాటి టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయంపై అంబటి రాయుడు విమర్శలు
- తను కామ్‌గా ఉంటే కాన్ఫిడెన్స్ లేదని టీమిండియా మేనేజ్మెంట్ భావించిందని రాయుడి వ్యాఖ్య
- అది ఓ మూర్ఖమైన లాజిక్ అంటూ విసుర్లు
- నాలుగో స్థానానికి అజింక్యాను ఎంపిక చేసున్నా బాగుండేదని కామెంట్
- రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతమని ప్రశంస
గత వరల్డ్ కప్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా మరోసారి స్పందించాడు. అప్పటి టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయాన్ని విమర్శించాడు. ‘‘నాకు కాన్ఫిడెన్స్ లేదని వాళ్లు అనుకున్నారు. నేను కామ్‌గా నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోవడంతో వారు అలా భావించారు. అది వాళ్ల మూర్ఖపు లాజిక్. జస్ట్ అలా చూసి ఎవరి కాన్ఫిడెన్స్ స్థాయిలనైనా ఎలా నిర్ణయించగలం?’’ అని వ్యాఖ్యానించాడు. తనకు బదులు అజింక్యా రహానేను ఎంపిక చేసున్నా బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
‘‘నేను ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయాలను చెప్పా. నన్ను కాదన్నాక అజ్జూను (అజింక్యా రహానే) ఎంపిక చేసి ఉండాల్సింది. ఈసారి శ్రేయాస్‌ను తీసుకున్నట్టు నాలుగో స్థానానికి తగిన వాడిని ఎందుకు ఎంపిక చేయలేదు? ఇది చాలా షాకింగ్ అంశం. మన ప్రయత్నం వరల్డ్ కప్ కోసం కానీ ఏదో వ్యక్తిగత లీగ్ టోర్నమెంట్లు గురించి కాదుగా? ఆ టైంలో టీం మేనేజ్మెంట్ తనతో తనే నిజాయతీగా వ్యవహరించలేదు. కానీ, ఈసారి రోహిత్ శర్మ.. కెప్టెన్ బాధ్యతలను అద్భుతంగా నిర్వహిస్తున్నాడు’’ అని అంబటి రాయుడు కితాబునిచ్చాడు.