Team India: జైస్వాల్ నుంచి రింకూ వరకు అందరూ బాదుడే... ఆసీస్ పై టీమిండియా భారీ స్కోరు
- టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య రెండో టీ20
- తిరువనంతపురంలో మ్యాచ్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
- నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు
- అర్ధసెంచరీలతో అలరించిన జైస్వాల్, గైక్వాడ్, ఇషాన్ కిషన్
- చివర్లో రింకూ సింగ్ మెరుపుదాడి
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో నిన్న భారీ వర్షం కురిస్తే... ఇవాళ సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది. ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తో మొదలుపెట్టి రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, తిలక్ వర్మ... ఇలా టాపార్డర్ బ్యాటర్లు అందరూ ఆసీస్ బౌలింగ్ ను ఊచకోత కోశారు.
ముఖ్యంగా, జైస్వాల్, గైక్వాడ్ జోడీ తొలి వికెట్ కు 5.5 ఓవర్లలోనే 77 పరుగులు జోడించి శుభారంభం అందించింది. ఆసీస్ కొత్త బంతి బౌలర్లను చీల్చిచెండాడిన జైస్వాల్ కేవలం 25 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. గైక్వాడ్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు నమోదు చేశాడు.
ఇషాన్ కిషన్ సైతం ధాటిగా ఆడడంతో టీమిండియా స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. కిషన్ 32 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వచ్చీ రావడంతోనే సిక్స్ తో పరుగులు వేట ప్రారంభించాడు. సూర్య 10 బంతుల్లో 2 సిక్సులతో 19 పరుగులు చేసి నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
చివర్లో రింకూ సింగ్ దడదడలాడించాడు. రింకూ కేవలం 9 బంతుల్లోనే 31 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 4 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. మరో ఎండ్ లో తిలక్ వర్మ 2 బంతుల్లో 1 సిక్స్ సాయంతో 7 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, మార్కస్ స్టొయినిస్ 1 వికెట్ తీశారు. టీమిండియా ఇన్నింగ్స్ లో టాపార్డర్ బ్యాటర్లలో ప్రతి ఒక్కరూ సిక్సులు కొట్టడం విశేషం.