China: చైనాలో న్యుమోనియా కేసుల తీవ్రత... రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
- చైనాలోని చిన్నారుల్లో ప్రబలుతున్న న్యుమోనియా తరహా లక్షణాలు
- చైనా ఆసుపత్రులు చిన్నారులతో కిటకిలాడుతున్నాయంటూ వార్తలు
- చైనాలో పరిస్థితిని గమనిస్తున్నామన్న కేంద్రం
- రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి
చైనాలో గత కొన్నిరోజులుగా ఆసుపత్రుల్లో రోగుల చేరిక అధికంగా ఉంటోందని, పెద్ద సంఖ్యలో పిల్లలు న్యుమోనియా తరహా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారంటూ తీవ్ర కలకలం రేగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చైనాలో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నామని, ఇప్పటివరకైతే ఆందోళన చెందాల్సిందేమీ లేదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే, ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
చైనాలో పరిస్థితులే ఇక్కడా సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలు, ఇతర ఏర్పాట్లపై సమీక్ష చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఆసుపత్రుల్లో బెడ్లు, అత్యవసర మందులు, ఆక్సిజన్ సదుపాయాలు, పీపీఈ సూట్లు, టెస్టింగ్ కిట్లు తగినన్ని అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది.
అంతేకాదు, వెంటిలేటర్ల పనితీరు, ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలు జరపాలని పేర్కొంది. తీవ్ర శ్వాసకోశ సమస్యలు, ఇన్ ఫ్లుయెంజా వైరస్ లతో బాధపడేవారి నమూనాలను వైరస్ పరిశోధన ల్యాబ్ లకు పంపించాలని సూచించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.