Andhra Pradesh: షాంపూతో జుట్టు రాలిందంటూ తనని దూషించిన మహిళపై యువకుడి దాడి
- కాకినాడలో ఘటన
- మెడికల్ షాపులో కొనుగోలు చేసిన షాంపూతో వృద్ధురాలి జుట్టు రాలిన వైనం
- షాపులోని యువకుడిపై వృద్దురాలి ఆగ్రహం
- రోజూ తనను దూషిస్తోందన్న ఆగ్రహంతో వృద్ధురాలిపై యువకుడి హత్యాయత్నం
తనను రోజూ దూషిస్తోందన్న కోపంతో ఓ వృద్ధురాలిపై మెడికల్ షాపు సిబ్బంది ఒకరు దాడి చేసిన ఘటన కాకినాడలో వెలుగు చూసింది. కాకినాడ రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్ వెంకట నారాయణ వీధికి చెందిన చెల్లంచెర్ల సత్యవతి ఇటీవల ఓ జనరిక్ మెడికల్ షాపులో షాంపూ కొన్నారు. ఆ తరువాత ఆమెకు జుట్టు రాలడంతో దుకాణంలో పనిచేస్తున్న యువకుడు వెంకటేశ్‌ను దూషించడం ప్రారంభించారు. రోజూ ఆమె తనను దుర్భాషలాడటాన్ని భరించలేకపోయిన అతడు ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
ఆదివారం వెంకటేశ్ ఓ దుకాణంలో కత్తి కొనుగోలు చేశాక, వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి ఆమెపై దాడి చేశాడు. కత్తితో పలుమార్లు పొడిచాడు. ఈ క్రమంలో కత్తి విరిగిపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.