Gujarat: గుజరాత్లో అకాల వర్షాలు.. పిడుగులు పడి 20 మంది మృతి
- పలు జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షాలు
- 16 గంటల్లోనే 50 నుంచి 117 మిల్లీమీటర్ల వర్షపాతం
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేంద్రమంత్రి అమిత్ షా
అకాల వర్షాలతో గుజరాత్ అల్లాడిపోతోంది. జోరువానలకు తోడు పిడుగులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆదివారం పిడుగులు పడి రాష్ట్రవ్యాప్తంగా 20 మంది మృత్యువాత పడ్డారు. విషయం తెలిసిన కేంద్రమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
గుజరాత్ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (ఎస్ఈవోసీ) ప్రకారం.. సూరత్, సురేంద్రనగర్, ఖేడా, తాపి, భరూచ్, అమ్రేలి జిల్లాల్లో రికార్డు స్థాయిలో గత 16 గంటల్లో 50 నుంచి 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేటి నుంచి క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.