Israel-Hamas War: బందీలను విడుదల చేస్తున్న హమాస్.. సంధి పొడిగింపునకు ప్రయత్నాలు
- మూడోరోజు 17 మంది బందీలను విడుదల చేసిన హమాస్
- విడుదలైన వారిలో నాలుగేళ్ల ఇజ్రాయెల్-అమెరికన్ బాలిక
- ప్రతిగా 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన నాలుగు రోజుల సంధితో రెండు దేశాల మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా పాలస్తీనా టెర్రర్ గ్రూప్ మూడో విడతలో నాలుగేళ్ల ఇజ్రాయెల్-అమెరికా బాలిక సహా 17 మందిని విడుదల చేసింది. ఈ సందర్భంగా హమాస్ గ్రూప్ కీలక ప్రకటన చేసింది.
ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను విడుదల చేసే విషయంలో ఆ దేశం తీవ్రంగా ఆలోచిస్తే కనుక సంధి పొడిగింపునకు తమకు అభ్యంతరం లేదని ప్రకటించింది. రెడ్‌క్రాస్ ప్రకారం.. హమాస్ విడుదల చేసిన 17మందిలో 13 మంది ఇజ్రాయెలీలు, ముగ్గురు థాయ్ దేశస్థులు, ఒక రష్యన్ ఉన్నారు. ప్రతిగా ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. వెస్ట్‌బ్యాంక్ రాజధాని రమల్లాలో వారికి ఘన స్వాగతం లభించింది. హమాస్ సంధి పొడిగింపు వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు స్పందించలేదు.