KCR: కేసీఆర్ ను వేటాడేందుకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నా: రేవంత్ రెడ్డి
- కామారెడ్డి ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోతుందన్న టీపీసీసీ చీఫ్
- అమ్మగారి ఊరు కేసీఆర్ కు 40 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందంటూ ఎద్దేవా
- కామారెడ్డి భూములను మింగేందుకే ఇక్కడికి వచ్చిండని ఆరోపణ
గడిచిన నలభై ఏళ్లుగా గుర్తురాని అమ్మగారి ఊరు కేసీఆర్ కు ఇప్పుడు గుర్తొచ్చిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇన్నేళ్లలో గల్ఫ్ కార్మికుల గోసను ఏనాడూ ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు కేసీఆర్ కు తీరికే దొరకలేదని అన్నారు. ఇప్పుడు ఆయన కామారెడ్డికి వచ్చింది ప్రజల కోసం కాదని, ఇక్కడున్న భూములను కాజేసేందుకే వచ్చాడని ఆరోపించారు.
పేదల రక్తం రుచి మరిగిన కేసీఆర్ ను వేటాడేందుకే తాను కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో బొందపెట్టాలని కామారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు.