Rythubhandu: రైతుబంధును ఆపేయడంపై హరీశ్ రావు స్పందన
- కాంగ్రెస్ పార్టీ కుట్ర మరోసారి బయటపడిందన్న మంత్రి
- పంపిణీకి అనుమతిచ్చాక కూడా మళ్లీ ఫిర్యాదు
- కాంగ్రెస్ లీడర్ నిరంజన్ ఫిర్యాదు వల్లే ఈసీ నిర్ణయం
రైతుబంధు పంపిణీని నిలిపేయాలంటూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన తాజా ఆదేశాలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ రైతులపై, రైతుబంధుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర మరోసారి బయటపడిందని అన్నారు. రైతన్నలకు సాయం అందకుండా కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు పంపిణీ చేయొచ్చంటూ ఈసీ అనుమతిచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ తన దుర్బుద్ధిని వదులుకోలేదని మండిపడ్డారు. టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ ఫిర్యాదు చేయడం వల్లే రైతుబంధు పంపిణీని నిలిపివేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు.
రైతుబంధును కాంగ్రెస్ పార్టీ ఆపిందనడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను అర్థం చేసుకోవాలంటూ తెలంగాణ ప్రజలు, రైతులకు మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. కాగా, ఎన్నికల ప్రచారంలో రైతుబంధు పంపిణీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలతోనే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.