Virat Kohli: ఈ విషయం చెప్పడానికి నేను సిగ్గుపడడం లేదు: కోహ్లీ

Kohli told once he thought about leaving RCB

  • ఐపీఎల్ లో మొదటి నుంచి ఆర్సీబీతో కొనసాగుతున్న కోహ్లీ
  • ఓ దశలో ఆర్సీబీని వదిలి వెళ్లడంపై ఆలోచించానని వెల్లడి
  • కొన్ని ఫ్రాంచైజీలు తనను సంప్రదించాయని వివరణ
  • కానీ ఆ ఫ్రాంచైజీలు తాను కష్టకాలంలో ఉన్నప్పుడు మద్దతు ఇవ్వలేదని వ్యాఖ్యలు

ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో విరాట్ కోహ్లీది విడదీయరాని అనుబంధం. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కోహ్లీ ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. అయితే ఓ దశలో తాను బెంగళూరు జట్టును వదిలి మరో ఫ్రాంచైజీకి వెళ్లే ఆలోచన కూడా చేశానని, ఆ విషయం చెప్పడానికి తాను సిగ్గుపడడంలేదని కోహ్లీ వెల్లడించాడు. 

2022 సీజన్ లో తనను కూడా వేలంలో ఉంచేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని, కొన్ని ఫ్రాంచైజీలు తనను సంప్రదించాయని వివరించాడు. కానీ, తాను ఆర్సీబీలోనే ఉండాలని నిశ్చయించుకున్నానని స్పష్టం చేశాడు. 

కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన ఫ్రాంచైజీ ఆర్సీబీ అని, అందుకే అనేక అవకాశాల వచ్చినప్పటికీ తాను ఆ జట్టుతోనే కొనసాగడం వైపే మొగ్గు చూపానని తెలిపాడు. తనను సంప్రదించిన ఫ్రాంచైజీలు తాను కష్టకాలంలో ఉన్నప్పుడు మద్దతుగా నిలవలేదని, ఆ సమయంలో ఆర్సీబీ తనపై చూపించిన విశ్వాసం మరువలేనని కోహ్లీ పేర్కొన్నాడు. 

"బెంగళూరు తరఫున నేను ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవలేదు. ట్రోఫీ గెలిచే అవకాశం ఉన్న మరో ఫ్రాంచైజీలో చేరడం కంటే నన్ను నమ్మే ఫ్రాంచైజీలో ఉండడమే ధర్మం అని భావించాను. కొందరు ట్రోఫీలు గెలిచి ఉండొచ్చు. కానీ ఓ గదిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరూ ఐపీఎల్ చాంపియన్ అని, వరల్డ్ కప్ చాంపియన్ అని పిలవరు. మీరు మంచి వ్యక్తా, కాదా అనేది చూస్తారు. మీరు మంచి వాళ్లయితే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు, మీరు చెడ్డ వ్యక్తి అయితే మిమ్మల్ని దూరంగా ఉంచుతారు.... జీవితం అంటే ఇలాగే ఉంటుందని నేను నమ్ముతాను" అని కోహ్లీ వివరించాడు.

  • Loading...

More Telugu News