Hardik Pandya: గుజరాత్ టైటాన్స్ ను వీడిపోతుండడం పట్ల హార్దిక్ పాండ్యా స్పందన
- ఐపీఎల్ లో అతి పెద్ద ఆటగాళ్ల బదిలీ ఒప్పందం
- హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్
- గుజరాత్ టైటాన్స్ భారీ మొత్తానికి డీల్
- టైటాన్స్ యాజమాన్యానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన పాండ్యా
స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లో మళ్లీ పాతగూటికి చేరిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబయి ఇండియన్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో, గుజరాత్ టైటాన్స్ ను వీడి వెళ్లిపోతుండడం పట్ల హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు.
"గుజరాత్ టైటాన్స్ యాజమాన్యానికి, జట్టుకు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుజరాత్ టైటాన్స్ జట్టులో ఓ సభ్యుడిగా ఉండడం, జట్టుకు నాయకత్వం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను. నన్ను, నా కుటుంబాన్ని విశేషంగా ఆదరించారు, అభిమానించారు. ఓ ఆటగాడిగా, ఓ వ్యక్తిగా నాకు ఎంతో ప్రోత్సాహం అందించారు. గుజరాత్ టైటాన్స్ తో నా అనుభవాలు, స్మృతులకు నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. చిరస్మరణీయ ప్రస్థానాన్ని అందించినందుకు కృతజ్ఞతలు" అంటూ హార్దిక్ పాండ్యా వివరించాడు.
7 సీజన్ల పాటు ముంబయి ఇండియన్స్ కు ఆడిన హార్దిక్ పాండ్యా 2022లో గుజరాత్ టైటాన్స్ కు వెళ్లాడు. పాండ్యా కెప్టెన్సీలో ఆడిన తొలి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. దాంతో హార్దిక్ పాండ్యా పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాతి సీజన్ లోనూ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరింది. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్ గా నిలిచింది. అయితే, గత కొన్ని సీజన్లుగా ఆశించిన మేర రాణించలేకపోతున్న ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్యాపై కన్నేసింది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ కు భారీ మొత్తం చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది.