Rapido: హైదరాబాద్ ఓటర్లకు ర్యాపిడో బంపర్ ఆఫర్
- మరో మూడ్రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
- నవంబరు 30న పోలింగ్
- పోలింగ్ కేంద్రాలకు వెళ్లే ఓటర్లను ఉచితంగా తీసుకెళ్లనున్న ర్యాపిడో
- నగరంలోని 2,600 పోలింగ్ కేంద్రాలకు ర్యాపిడో ఉచిత రైడ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మరో మూడ్రోజుల సమయం మాత్రమే మిగిలుంది. ఈ నెల 30న తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో హైదరాబాద్ ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటింగ్ రోజున నగరంలోని 2,600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా తీసుకెళతామని వెల్లడించింది.
పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలనుకునే ఓటర్లకు సాయం చేస్తామని, తద్వారా ఓటింగ్ శాతం పెరిగేలా తమవంతు తోడ్పాటు అందిస్తామని ర్యాపిడో ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా యువ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో తమ ఉచిత రైడ్ పథకం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వెల్లడించారు.
భారతదేశానికి ప్రజాస్వామ్యమే అతిపెద్ద ఆభరణం అని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడంలో తమవంతు సహకారం అందిస్తామని వివరించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నామని పిలుపునిచ్చారు.
పోలింగ్ కేంద్రాలకు ఎలా చేరుకోవాలా అని ఓటర్లు చింతించనక్కర్లేదని, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు ర్యాపిడో బైక్ ల ద్వారా ఉచితంగా చేరవేస్తామని పవన్ గుంటుపల్లి పేర్కొన్నారు. ఓటు వేసే క్రమంలో రవాణా వ్యవస్థ ఓ ప్రతిబంధకం కారాదన్నది తమ అభిమతమని వివరించారు.