Nara Lokesh: పాదయాత్రకు బ్రేక్ ఇచ్చినందుకు సారీ!: ప్రజలకు క్షమాపణ చెప్పిన లోకేశ్

Nara Lokesh says sorry for people

  • నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం
  • రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి మళ్లీ మొదలైన పాదయాత్ర
  • తాటిపాకలో భారీ బహిరంగ సభ
  • లోకేశ్ సభకు పోటెత్తిన టీడీపీ, జనసేన శ్రేణులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 79 రోజుల సుదీర్ఘ విరామానంతరం రాజోలు నియోజకర్గం పొదలాడ నుంచి పునఃప్రారంభమైంది. లోకేశ్ 210వ రోజు యువగళం పాదయాత్రకు విశేష స్పందన లభించింది. 

పొదలాడ క్యాంప్ సైట్ నుండి సోమవారం ఉదయం 10.19 నిమిషాలకు లోకేశ్ పాదయాత్ర పునఃప్రారంభించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావుతోపాటు రాష్ట్రస్థాయి నాయకులంతా లోకేశ్ సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు ఉమ్మడిగా యువగళం పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

తాటిపాక సెంటర్ లో నిర్వహించిన యువగళం బహిరంగసభకు జనం పోటెత్తారు ఇరుపార్టీల కేడర్ నినాదాలతో దద్దరిల్లుతున్న తాటిపాక బహిరంగసభ పరిసరాలు దద్దరిల్లాయి. కోనసీమ నలుమూలల నుంచి భారీఎత్తున జనం సభకు హాజరయ్యారు. సభ అనంతరం దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజలు యువనేతకు ఎదురేగి స్వాగతం పలికి తమ సమస్యలు చెప్పుకున్నారు. 

తాటిపాక సభలో లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...

ముందుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను. మీరంతా నన్ను పెద్ద మనస్సుతో క్షమించాలి. యువగళం పాదయాత్ర కు 79 రోజులు బ్రేక్ ఇచ్చినందుకు మీరు నన్ను క్షమించాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జనవరి 27 న నేను యువగళం పాదయాత్ర ప్రారంభించాను. 400 రోజులు 4000 వేల కిలోమీటర్లు పాదయాత్ర చెయ్యాలని నిర్ణయించుకొని కుప్పం నుండి పాదయాత్ర ప్రారంభించాను. యువగళానికి బ్రేకులు లేవు, వీక్ ఆఫ్ లేదు, శనివారం, ఆదివారం లేదు. 209 రోజుల పాటు ప్రజల్లో ఉన్నా. 10 ఉమ్మడి జిల్లాల పరిధిలో 2853 కిలోమీటర్లు పాదయాత్ర చేసాను.

సంక్షోభాలకు ఎదురొడ్డి పోరాడే దమ్ము మాకుంది!

సంక్షోభాలు, పోరాటాలు టీడీపీకి కొత్త కాదు. ఎన్టీఆర్ గారి దగ్గర నుండి చంద్రబాబు వరకూ అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నారు, కష్టాలకు ఎదురునిలబడి పోరాడే దమ్ము టీడీపీకి ఉంది. యుద్ధం మొదలైంది... సైకో జగన్ కి ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయింది. సైకో మా కుటుంబం పై కక్ష పెంచుకున్నాడు. ఆఖరికి మా అమ్మ భువనమ్మ, నా భార్య బ్రాహ్మణిపై కూడా కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తామని మంత్రులు మాట్లాడారు. ఆ మంత్రులకు భయం పరిచయం చేసే బాధ్యత నాది. సైకోల బెదిరింపులకు, ఉడత ఊపులకు మేము భయపడలేదు. మూడు నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి ప్యాకప్.

రూ.43 వేల కోట్లు మింగిన వాడ్ని ఏం చేయాలి?

ఏ తప్పూ చేయని మమ్మల్నే కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి వస్తే 38 కేసులు, రూ.43 వేల కోట్ల ప్రజాధనం దొబ్బిన పిచ్చోడిని ఏం చెయ్యాలి. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా డాన్ గా మారిన పిచ్చోడు మూడు నెలల్లో పర్మినెంట్ గా జైలుకి పోవడం ఖాయం. ఈ వైసీపీ నేతలు ఎక్కడికి పోతారు, మంత్రులు ఎక్కడికి పోతారు? అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలందరూ జైలుకెళ్లడం పక్కా... మరి జైలర్ ఎవరో తెలుసా... చంద్రబాబే. మీ తాట తీస్తారు. ఇది ఖాయం... రాసిపెట్టుకోండి.

చంద్రబాబును చూస్తే సైకోకి భయం!

చంద్రబాబుని చూస్తే సైకోకి భయం కాబట్టే అక్రమంగా అరెస్ట్ చేసాడు. సొంత అమ్మని చూసినా, సొంత చెల్లిని చూసినా సైకో జగన్ కి భయమే. సైకో అని ఎందుకు అంటున్నానో మీ అందరికీ క్లారిటీ ఉండాలి. చంద్రబాబు గారి పై ఎన్ని అక్రమ కేసులు పెట్టాడో మీరే చూశారు. స్కిల్ డెవెలప్ మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఇసుక కేసు, లిక్కర్ కేసు... త్వరలో అన్న క్యాంటిన్ కేసు కూడా పెడతారంట. పేదలకు ఉచితంగా అన్నం పెట్టడం వలన రాష్ట్ర ఖజానాకి నష్టం వచ్చింది అని కేసు పెడతాడట.

స్కిల్ కేసులో ఒక్క ఆధారమూ చూపలేదు

స్కిల్ కేసు లో వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టి సైకో జగన్ ఆనందం పొందాడు. కానీ హైకోర్టులో నిజం గెలిచింది. బెయిల్ ఇస్తూ ఇచ్చిన ఆర్డర్ కాపీ చదివిన ఎవరికైనా జగన్ వ్యవస్థల్ని ఎలా నాశనం చేశాడో అర్ధం అయ్యింది. నాపై కూడా అనేక కేసులు పెట్టారు, సీఐడీ విచారణకు పిలిచారు. ధైర్యంగా వెళ్లాను. ఏం పీక్కుంటారో పీక్కోమని చెప్పాను. తప్పు చేస్తే చంద్రబాబు గారే నన్ను వదిలిపెట్టరు.

తూర్పుగోదావరి అంటే నాకు ఇష్టం

తూర్పుగోదావరి జిల్లా అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఈ పచ్చదనం, గోదావరి చూసి ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా ప్రజలు చూపించే మమకారం, వెటకారం రెండూ సూపర్. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి రాజోలు. ప్రముఖ పర్యాటక కేంద్రం రాజోలు. మంగళంపల్లి బాల మురళీ కృష్ణ , బయ్యా సూర్య నారాయణ మూర్తి, పట్టి కామమ్మ లాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన గడ్డ రాజోలు.

రాజోలును అవినీతి అడ్డాగా మార్చిన రాపాక

ఇక్కడ జనసేన శాసనసభ్యుడిగా ఎన్నికైన రాపాక వరప్రసాద్ గారు వెన్నుపోటు పొడిచి వైసీపీ పంచన చేరి రాజోలుని అవినీతికి అడ్డాగా మార్చేశారు. మలికిపురం మండలం కత్తిమండలో 5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.2 కోట్లతో అధునాతన భవనాన్ని నిర్మించుకున్నారు. ఆ ఇంటికి రోడ్డు కోసం రూ.20 లక్షల ఎంపీ లాడ్స్ ను వినియోగించారు. చింతలమోరి సముద్రతీరంలో పేదలకు చెందిన 15 ఎకరాలకు పైగా భూములను ఆక్రమించారు. గతంలో దిండి ఇసుకరీచ్ ను ఎమ్మెల్యే కుమారుడు వెంకట్రావు నిర్వహించారు.

ఐదుగురు మంత్రులయ్యారు... ఏం లాభం?

తూర్పుగోదావరి జిల్లా నుండి ఐదుగురు మంత్రులు అయ్యారు. కానీ జిల్లాకి చేసింది సున్నా. ఒక మంత్రి పేషీలో జీతాలు ఇవ్వలేదని పేషీకి తాళం వేశారు. ఇంకో మంత్రి ఖజానాకు కన్నం వేస్తే ఉద్యోగం పోయింది. మిగిలిన వాళ్లకు అసలు వారి శాఖ ఏంటో కూడా తెలియదు.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఈరోజు నడిచిన దూరం 15.4 కి.మీ.*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2867.8 కి.మీ.*

*211వరోజు (28-11-2023) యువగళం వివరాలు*

*అమలాపురం/ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గాలు*

*ఉదయం*

8.00 – పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.00 – పేరూరు క్షత్రియ కళ్యాణ మండపం వద్ద ఆక్వా రైతులతో భేటీ.

10.00 – అమలాపురం హైస్కూలు సెంటర్ లో బిసిలతో సమావేశం.

10.15 – అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ లో చేనేతలతో సమావేశం.

10.30 – అమలాపురం ముమ్మడివరం గేటు వద్ద దివ్యాంగులతో సమావేశం.

10.45 – అమలాపురం పుల్లయ్య రామాలయం వద్ద గంగిరెడ్డి సామాజికవర్గీయులతో భేటీ.

11.00 – అమలాపురం వెంకటేశ్వరస్వామి గుడివద్ద కాపులతో సమావేశం.

మధ్యాహ్నం

12.30 – భట్నవిల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

12.40 – భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి.

1.40 – భట్నవిల్లిలో భోజన విరామం.

*సాయంత్రం*

4.00 – భట్నవిల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.30 – పాదయాత్ర ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

5.00 – అనంతవరం సెంటర్ లో స్థానికులతో సమావేశం.

6.00 – గున్నేపల్లిలో స్థానికులతో సమావేశం.

7.45 – ముమ్మడివరంలో స్థానికులతో సమావేశం.

8.30 – ముమ్మడివరం ఉమెన్స్ కాలేజి వద్ద విడిది కేంద్రంలో బస.

******

  • Loading...

More Telugu News