Attack with Geometry Compass: 4వ తరగతి చిన్నారిపై తోటి విద్యార్థుల దాడి! కంపాస్‌తో 108 సార్లు పొడిచిన వైనం

MP Class 4 student attacked 108 times with geometry compass in Indore
  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోగల ఓ ప్రైవేటు పాఠశాలలో ఘటన
  • ప్రిన్సిపాల్‌కు చెప్పేందుకు భయపడ్డ బాధిత విద్యార్థి, ఇంటికొచ్చాక తల్లిదండ్రులకు చెప్పిన వైనం
  • బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు, ఘటనపై ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపణ
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిలకడగా విద్యార్థి ఆరోగ్యం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో తాజాగా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు స్కూల్లో నాలుగో తరగతి బాలుడు ఆరాధ్య పాండేపై ముగ్గురు తోటి విద్యార్థులు దాడి చేశారు. జామెట్రీ కంపాస్‌తో ఏకంగా 108 సార్లు పొడిచారు. ఎయిరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 24న ఈ ఘటన జరిగింది. దాడి విషయం స్కూల్ ప్రిన్సిపాల్‌కు చెప్పేందుకు భయపడ్డ బాధిత విద్యార్థి ఇంటికొచ్చాక తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. 

కాగా, ఘటనను ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరాధ్య పాండే తండ్రి ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీ కోరినా ఇవ్వలేదని పేర్కొన్నారు. చివరకు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల మధ్య చిన్న గొడవ అనూహ్యంగా ఈ దాడికి కారణమైందని తెలుస్తోంది.  కాగా, బాలుడికి వైద్య పరీక్షలు జరిగాయని, అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. విద్యార్థులందరూ 10 ఏళ్ల లోపు వారేనని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  

ఈ ఉదంతంపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా దృష్టి సారించింది. త్వరలో పిల్లలు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. వీడియో గేమ్స్‌లోని హింసాత్మక దృశ్యాల ప్రభావం పిల్లలపై పడిందా? అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని వెల్లడించింది.
Attack with Geometry Compass
Madhya Pradesh
Indore
Crime News

More Telugu News