rd T20 match: భారత్-ఆస్ట్రేలియా మధ్య నేడు 3వ టీ20 మ్యాచ్.. వర్షం కురిసే అవకాశం ఉందా?
- గువాహటి వేదికగా నేడు కీలకమైన 3వ టీ20 మ్యాచ్
- వర్షం కురిసే అవకాశం లేదంటున్న వాతావరణ శాఖ రిపోర్టులు
- పాక్షిక మేఘావృతమైనా మ్యాచ్ జరిగేందుకు సానుకూల వాతావరణం
- సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా.. రేసులో నిలవాలని ఆసీస్.. సిద్ధమైన ఇరుజట్లు
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం (నేడు) కీలక పోరు జరగనుంది. గువాహటిలోని బర్సపరా స్టేడియం వేదికగా మూడవ టీ20లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఊవ్విళ్లూరుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని ఆసీస్ భావిస్తోంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లకు పిచ్ చాలా కీలకంగా మారనుందని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మ్యాచ్ నేపథ్యంలో గువాహటిలో వాతావరణ రిపోర్ట్ విడుదలైంది. ప్రస్తుతానికి అక్కడ వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ రిపోర్ట్ లో పేర్కొంది. 20 శాతం పాక్షిక మేఘావృతం అవుతుందని, అయితే వర్షం పడే అవకాశం మాత్రం లేదని తెలిపింది. 19 - 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య ఆడాల్సి ఉంటుందని వివరించింది. తేమ ఎక్కువగా ఉండనుందని, గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మొత్తంగా మ్యాచ్ జరగడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పింది. ఇదిలావుంచితే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఓటమి తర్వాత మొదటి సిరీస్‌లో టీమిండియా యువక్రికెటర్లు చెలరేగి ఆడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టు ఇప్పటికే విశాఖపట్నం, తిరువనంతపురం మ్యాచ్‌ల్లో విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే.
మరోవైపు మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ మొదటి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఇక చివరి రెండు మ్యాచ్‌ల్లో గ్లెన్ మాక్స్‌వెల్ విఫలమయ్యాడు. సిరీస్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో ఆసీస్ తప్పక గెలవాల్సి ఉంది.