K Kavitha: బాండ్ పేపర్లతో కాంగ్రెస్ సీనియర్ నేతల కొత్త డ్రామా: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha on Congress leaders bond paper issue

  • 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలన్న కవిత
  • ఉద్యోగాల విషయంలో నేను చెప్పింది తప్పయితే ఒక్క ఓటు కూడా అడగమని సవాల్
  • కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శలు

బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరలేపారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీటిని ప్రజలు కనుక నమ్మితే కన్నీళ్లే మిగులుతాయని హెచ్చరించారు. మల్లు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటి నేతలు బాండ్ పేపర్ రాసివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలన్నారు. ఆ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, అందుకే బాండ్ పేపర్ రాసిచ్చే పరిస్థితికి వచ్చారన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇదేవిధంగా డ్రామాలు ఆడిందని ధ్వజమెత్తారు. 223 సీట్లలో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులు హామీలను అమలు చేస్తామంటూ బాండ్ పేపర్లు రాశారని, కానీ వాటిలో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ వచ్చాక రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయని, వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని, 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని, ఉద్యోగాలు పెరిగాయన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఎంతో అభివృద్ధి చేసిందని, మూడోసారి గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు కొత్త పాలసీని ప్రకటిస్తామన్నారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ కలిసి గత అయిదేళ్లలో 21 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాయని, కానీ తెలంగాణలో గత పదేళ్ల కాలంలో 2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే ఒక్క ఓటు కూడా అడగమని సవాల్ చేశారు. తాను చెప్పిన దాంట్లో తప్పుంటే ప్రశ్నించవచ్చు అన్నారు. రేషన్ కార్డు సమస్యలు పరిష్కరించి అందరికీ రూ.5 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో మహిళలకు రూ.2 వేల పెన్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటూ ఇచ్చిన హామీల అమలు ఇంకా ప్రారంభించలేదన్నారు. యువనిధి కింద ఇస్తామన్న మొత్తాన్ని కూడా పంపిణీ చేయడం లేదని, బియ్యం పథకానికి తూట్లు పొడిచిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి బస్సుల సంఖ్యను భారీగా తగ్గించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకుల నిరుద్యోగ సమావేశాలు ఆ పార్టీ రాజకీయ నిరుద్యోగతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News