KCR: ఇందిరమ్మ రాజ్యమంత దరిద్రపు రాజ్యం మరొకటి లేదు: కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
- తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచిందని వ్యాఖ్య
- భద్రకాళీ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సాధించుకున్నామన్న కేసీఆర్
- రాజముద్రలో కాకతీయ తోరణం, చెరువుల కార్యక్రమానికి మిషన్ కాకతీయ పేరు పెట్టుకున్నామని గుర్తు చేసిన కేసీఆర్
- తద్వారా కాకతీయ రాజులకు ఘన నివాళి అర్పించామన్న ముఖ్యమంత్రి
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచిందని, ఉద్యమంలో అతి భారీ బహిరంగసభ ఇక్కడే జరిగిందని, భద్రకాళీ అమ్మవారి ఆశీస్సులతో మనం తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అందుకే తాను అమ్మవారికి కిరీట ధారణ చేసి మొక్కు కూడా చెల్లించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్ర వైభవానికి, వెయ్యేళ్ల తెలంగాణ చరిత్రకు సాక్షీభూతంగా ఈ ఓరుగల్లు నిలిచిందని, ఈ వీరభూమికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.
ఆయన మంగళవారం వరంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవం ఇచ్చిందని, రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టామని తెలిపారు. అలాగే చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి మిషన్ కాకతీయ అని పెట్టుకున్నామన్నారు. తద్వారా కాకతీయ రాజులకు మనం నిజమైన నివాళి అర్పించామన్నారు. ఉద్యమాన్ని తలకెత్తుకున్న సమయంలో కాళోజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తనను ఆశీర్వదించారని వారిని స్మరించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీరు వేసే ఓటు తెలంగాణతో పాటు వరంగల్ నియోజకవర్గాల అయిదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు మళ్లీ ఇందిరమ్మ రాజ్యమని చెబుతున్నారని, కానీ అంత దరిద్రపు రాజ్యం మరొకటి లేదని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో అరాచకాలు జరిగాయని, తెలంగాణ కోసం ఉద్యమించిన 400 మందిని కాల్చి చంపారన్నారు. ఎమర్జెన్సీ పెట్టి అందర్నీ జైళ్లలో వేశారని గుర్తు చేశారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యం కావాలా? అని ప్రశ్నించారు.