BTech Ravi: టీడీపీ పులివెందుల ఇన్ఛార్జీ బీటెక్ రవికి బెయిల్ మంజూరు
- బీటెక్ రవికి బెయిల్ మంజూరు చేసిన కడప కోర్టు
- ఈ నెల 14 నుంచి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రవి
- కడప విమానాశ్రయం వద్ద పోలీసులతో వాగ్వాదం నేపథ్యంలో రవిపై కేసు
టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జీ, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి కడప కోర్టులో ఊరట లభించింది. ఆయనకు కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన ఈ సాయంత్రం జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి కడప జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ నెల 14న బీటెక్ రవిని వల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బీటెక్ రవి అరెస్ట్ వివరాల్లోకి వెళ్తే... నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఆ సందర్భంగా లోకేశ్ కు స్వాగతం పలికేందుకు బీటెక్ రవి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. విమానాశ్రయంలోకి వెళ్లడానికి ఆయన ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.