Ambati Rambabu: లోకేశ్, పవన్, పురందేశ్వరిలపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు
- జగన్ వల్ల పేద విద్యార్థులు కార్పొరేట్ విద్యను చదువుతున్నారన్న అంబటి
- కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను అందించారని కితాబు
- జగన్ ను ప్రజలు మళ్లీ సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
రాష్ట్రంలో ప్రతి విద్యార్థి కార్పొరేట్ విద్యను చదువుతున్నాడంటే దానికి ముఖ్యమంత్రి జగనే కారణమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వెల్ నెస్ సెంటర్ల ద్వారా ప్రతి గ్రామంలో వైద్యం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. కరోనా పంజా విసురుతున్న సమయంలో అన్ని రాష్ట్రాలు అల్లాడుతుంటే... జగన్ మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా సంక్షేమ పథకాలను అందించారని కొనియాడారు. గత ప్రభుత్వాలు చేసిన పనుల ఆధారంగా ఈ ఐదేళ్లలో అన్ని పనులు పూర్తవుతాయని అనుకున్నామని... తీరా అక్కడకు వెళ్లి చూస్తే అన్నీ అవకతవకలేనని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుందనే ముహూర్తాన్ని తాను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు.
నారా లోకేశ్ పాదయాత్ర ఒక పెద్ద కామెడీ షో అని అంబటి ఎద్దేవా చేశారు. లోకేశ్ కు రాష్ట్రం గురించి అవగాహన లేని పవన్ కల్యాణ్ వత్తాసు పలుకుతున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ముసుగులో పురందేశ్వరి టీడీపీ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ప్రజలు పూర్తి స్పష్టతతో ఉన్నారని... మళ్లీ జగన్ ను ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.