Telangana Assembly Election: రేపు ఎన్నికల పోలింగ్.. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన
- రేపు, ఎల్లుండి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటన
- ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనున్నట్లు తెలిపిన వాతావరణ శాఖ
- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడి
ఓ వైపు రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేస్తోన్న సమయంలో తెలంగాణలో రేపు వర్షం వచ్చే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో రేపు, ఎల్లుండి... రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనున్నట్లు తెలిపింది.
ఈ వాయుగుండం బంగాళాఖాతంలో వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని, దీంతో తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చునని తెలిపింది. హైదరాబాద్‌లో ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం ఉండవచ్చునని, పరిసర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవవచ్చునని తెలిపింది. అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలకు తేలికపాటి వర్షాలు, డక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.