Nara Lokesh: జగన్ ఆఫీస్‌లో పనిచేస్తున్న అధికారులు ఢిల్లీకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు: నారా లోకేశ్
- డిప్యుటేషన్ పై వెళ్లేందుకు పర్మిషన్ కోసం అధికారులు దరఖాస్తు చేసుకున్నారన్న యువనేత
- జగన్ మాట విని చట్టాలను ఉల్లంఘించిన అధికారులను వదలబోనని హెచ్చరించిన లోకేశ్
- బుధవారం ‘ముమ్మిడివరం నియోజకవర్గం’లో యువగళం యాత్ర
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం పాదయాత్ర’లో దూసుకెళ్తున్నారు. దాదాపు రెండున్నర నెలల తర్వాత రాజోలు నియోజకవర్గం పొదలాడలో యాత్రను పునఃప్రారంభించిన ఆయన బుధవారం ముమ్మిడివరం నియోజకవర్గంలో కొనసాగించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ పనైపోయిందని ఆగ్రహించారు. జగన్ మాట విని చట్టాలను ఉల్లంఘించి, తప్పుడు పనులు చేసిన అధికారులు డిప్యుటేషన్‌పై ఢిల్లీ వెళ్ళి దాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇదీ తన యువగళం దెబ్బేనని, ఎక్కడ దాక్కున్నా తప్పు చేసిన అధికారులను శిక్షించి తీరుతానని లోకేశ్ హెచ్చరించారు.
‘‘జగన్ పనైపోయింది. ఇది ఎందుకు చెబుతున్నానంటే జగన్ ఆఫీస్‌లో పనిచేస్తున్న అధికారులు అందరూ ఇప్పుడు ఢిల్లీకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. డిప్యుటేషన్ మీద వెళ్లేందుకు పర్మిషన్ కోసం అప్లై చేశారు. అదే యువగళం దెబ్బ. ఏ అధికారులైతే జగన్ మాట విని చట్టాన్ని ఉల్లంఘించారో.. మీరు ఢిల్లీలో ఉన్నా శిక్షపడేలా చేసే బాధ్యత నేను తీసుకుంటాను’’ అని లోకేశ్ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది.
ఇక ముమ్మిడివరం నియోజకవర్గం పల్లెపాలెం సెంటర్లో యువ నేత లోకేశ్‌ను ఎస్సీ సామాజిక వర్గీయులు కలిశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కారు రద్దు చేసిన 27న ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా యువనేత హామీ ఇచ్చారు. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిందని, రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి అన్యాయానికి పాల్పడిందని ఆరోపించారు.