CPI Ramakrishna: తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి కోసం.. కేసీఆర్, జగన్ కొత్త కుట్రకు తెరలేపారు: సీపీఐ రామకృష్ణ
- పోలింగ్ నాడు కలకలం రేపుతున్న నాగార్జునసాగర్ ఘర్షణ
- కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారన్న రామకృష్ణ
- ఈ ఘర్షణ కేసీఆర్, జగన్ ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రమే అని వ్యాఖ్య
నాగార్జునసాగర్ డ్యామ్ పై ఏపీ పోలీసులు ముళ్లకంచెలు వేసిన ఘటన తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయంలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందిస్తూ తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై మండిపడ్డారు. సాగర్ వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించడం వెనుక ఎన్నికల లబ్ధి ఉందని ఆయన ఆరోపించారు. పట్టిసీమలో నీళ్లు ఉన్నప్పటికీ ఇవ్వడానికి జగన్ కు మనస్కరించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో మరోసారి సెంటిమెంట్ ద్వారా లబ్ధిపొందాలని కేసీఆర్ భావిస్తున్నారని... ఇందులో భాగంగానే సాగర్ వద్ద హైడ్రామాను సృష్టించారని విమర్శించారు. ఈ ఘర్షణ కేవలం కేసీఆర్, జగన్ ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రమేనని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.