Free Ration: మరో ఐదేళ్లు 81.35 కోట్ల మందికి ఫ్రీ రేషన్
- కేంద్ర కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ నిర్ణయం
- ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద అమలు
- ప్రతి నెలా 5 కేజీల ఆహార ధాన్యాల పంపిణీ
దేశంలోని నిరుపేదలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించింది. 2024 జనవరి నుంచి ఐదేళ్ల పాటు యథావిధిగా అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మంగళవారం రాత్రి జరిగిన కేబినెట్ భేటీలో చర్చించి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
ఈ పథకంలో భాగంగా దేశంలోని 81.35 కోట్ల మందికి నెల నెలా 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తారు. అంత్యోదయ కుటుంబాలకు నెలకు 35 కేజీలు అందిస్తారు. ఉచిత రేషన్ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.11.80 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటితో పాటు డ్వాక్రా మహిళల స్వయం సమృద్ధి కోసం దేశంలోని మహిళా సంఘాలకు 15 వేల డ్రోన్లను అందజేయనున్నట్లు కేంద్రం తెలిపింది. వీటి ఖరీదులో 80 శాతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. మిగతా 20 శాతం మహిళా సంఘాలు భరించాల్సి ఉంటుంది. ఈ డ్రోన్లను వ్యవసాయానికి వాడుతారు. రైతులకు కిరాయికి ఇవ్వడం ద్వారా మహిళా సంఘాలు ఆదాయం పొందవచ్చు.