KTR: 2018లోనూ ఎగ్జిట్ పోల్స్ ఇలాగే చెప్పాయి: కేటీఆర్
- తెలంగాణలో ముగిసిన పోలింగ్
- ఎగ్జిట్ పోల్స్ విడుదల
- గతంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ను ఉదహరించిన కేటీఆర్
- అప్పుడు తామే గెలిచామని వెల్లడి
- ఇప్పుడు కూడా విజయం తమదేనని ధీమా... 70కి పైగా స్థానాలు వస్తాయని వివరణ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వచ్చాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి రెండో స్థానమేనని, కాంగ్రెస్ పార్టీకే ఓటర్ల ఆదరణ లభించిందని ఆయా సర్వేలు వెల్లడించాయి. కాగా, పోలింగ్ సరళిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.
2018లోనూ ఎగ్జిట్ పోల్స్ ఇలాగే చెప్పాయని, కానీ గెలిచింది తామేనని వెల్లడించారు. ఆ సమయంలో ఒక్క సంస్థ మాత్రమే సరైన ఫలితాన్ని అంచనా వేసిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆనాటి ఎగ్జిట్ పోల్స్ వివరాలను మీడియాకు ప్రదర్శించారు.
ఎగ్జిట్ పోల్స్ కంటే తాము ప్రజలనే నమ్ముతామని కేటీఆర్ అన్నారు. తన అంచనా ప్రకారం బీఆర్ఎస్ కు 88 సీట్లు వస్తాయని భావించానని, కానీ కొన్ని ఆటంకాలు రావడంతో 70 ప్లస్ స్థానాలు పక్కాగా వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. 70 సీట్లు మాత్రం ఖాయమని, ఆపైన ఎన్ని వస్తాయో చెప్పలేనని అన్నారు. ఈ విషయం డిసెంబరు 3 నాడు అందరూ చూస్తారని తెలిపారు.
"మా నాయకులకు, మా కార్యకర్తలకు నేను చెప్పేది ఏంటంటే... ఈ ఎగ్జిట్ పోల్స్ ను చూసి కంగారు పడవద్దు. గత ఎన్నికల సమయంలోనూ కొన్ని సంస్థలు ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ సర్వేలను వెల్లడించాయి. కానీ ఇవాళ ఆ సంస్థల పేర్లు చెబితే మీడియా సమావేశంలో ఉన్న కొందరు రిపోర్టర్లు బాధపడతారు. మరి, డిసెంబరు 3న ఫలితాలు వచ్చాక, తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినందుకు క్షమాపణలు చెబుతారా?
అయినా, ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మాకు వ్యతిరేకంగా ఉండడం ఇదేమీ కొత్త కాదు. కొన్ని జాతీయ సంస్థలు, మరికొన్ని సంస్థలు సర్వే నామమాత్రంగా చేస్తాయంతే. ఓ రెండొందల మందిని అడిగి అదే ప్రజాభిప్రాయం అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తుంటాయి. ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ ఉండదు. మాకొచ్చిన సమాచారం ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ రూపొందించామంటారు... తర్వాత వాళ్లే తెలుసుకుంటారు. కానీ, ఆయా సంస్థల విశ్వసనీయత దెబ్బతింటుందన్న విషయం గమనించాలి.
ఓవైపు ఓటర్లు ఇంకా క్యూలైన్లలో ఉన్నారు... ఎగ్జిట్ పోల్స్ వదిలారంటే ఏమనాలి? ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ 5.30 గంటల తర్వాతే విడుదల చేయాలని చెప్పింది... అప్పటికి ఇంకా ఓటర్లు క్యూలైన్లలోనే ఉన్నారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంటుంది? ఏదేమైనా ఎన్నికల సంఘం దీనిపై పరిశీలన చేపట్టాలి" అని వ్యాఖ్యానించారు.