Nara Lokesh: అలాంటి హామీలు నేను ఇవ్వను: నారా లోకేశ్
- యువగళం పాదయాత్రకు నేడు 213వ రోజు
- ముమ్మిడివరం నియోజకవర్గంలో పాదయాత్ర
- శెట్టిబలిజలతో లోకేశ్ ముఖాముఖి సమావేశం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా మూడోరోజు (గురువారం) కొనసాగింది. ముమ్మిడివరం నియోజకవర్గం సుంకరపాలెం క్యాంప్ సైట్ నుంచి 213వ రోజు యువగళం పాదయాత్ర టీడీపీ-జనసేన కార్యకర్తల కోలాహలం నడుమ ఉత్సాహంగా సాగింది.
కోరంగిలో కల్లుగీత కార్మికులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమై వారి సాధకబాధకాలు విన్నారు. సుంకరపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర... లచ్చిపాలెం, బాపనపల్లి, పి.మల్లవరం, తాళ్లరేవు, సీతారాంపురం, కోరంగి, పటవల, మట్లపాలెం, జి.వేమవరం మీదుగా చొల్లంగిపేట విడిది కేంద్రానికి చేరుకుంది.
50 ఏళ్లు దాటిన గీత కార్మికులకు పెన్షన్ ఇస్తాం
వైసీపీ బస్సు యాత్ర తుస్సుమంది... బీసీలకు ఎవరి హయాంలో న్యాయం జరిగిందో చర్చకు నేను సిద్ధం... బస్సు యాత్ర చేసే బ్యాచ్ సిద్ధమా? అని నారా లోకేశ్ సవాల్ విసిరారు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగిలో శెట్టిబలిజ సామాజిక వర్గీయులతో లోకేశ్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదరణ పథకం అమలు చేస్తాం అని భరోసా ఇచ్చారు. 90 శాతం సబ్సిడీతో పనిముట్లు అందిస్తామని హామీ ఇచ్చారు.
"ఆదరణ పథకం-2లో మీరు కట్టిన డబ్బుని వడ్డీ సహా ఇస్తాం. 50 ఏళ్లు దాటిన కల్లు గీత కార్మికులకు పెన్షన్ ఇస్తాం. కల్లు గీత కార్మికులకు చంద్రన్న బీమా అమలు చేస్తాం. నీరా కేఫ్ ల ఏర్పాటుకు సహకారంతో పాటు, చెట్ల పెంపకం కోసం ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తాం. విదేశీ విద్య ప్రారంభించి బీసీ విద్యార్థుల పైచదువులకి సాయం అందిస్తాం" అని స్పష్టం చేశారు.
అడ్డగోలు హామీలు ఇవ్వను
జగన్ అప్పు చేసి బటన్ నొక్కుతున్నాడు. 12 లక్షల కోట్లు అప్పు చేసాడు. ఇప్పుడు బటన్ నొక్కినా డబ్బులు పడని పరిస్థితి వచ్చింది. జగన్ దిగిపోయే సమయానికి ప్రతి ఏడాది వడ్డీనే లక్ష కోట్లు అవుతుంది. అమ్మ ఒడి, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు అయ్యే ఖర్చు బీసీల సంక్షేమం ఖాతాలో రాస్తున్నాడు. మద్యపాన నిషేధం హామీ ఇచ్చి మాట తప్పింది జగన్. జగన్ లాగా పరదాలు కట్టుకొని తిరగాలి అని నాకు లేదు. అమలు చెయ్యలేని అడ్డగోలు హామీలు నేను ఇవ్వను.
ఉపాధి హామీతో అనుసంధానిస్తాం
బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం ఇచ్చింది అన్న ఎన్టీఆర్. టీడీపీ శెట్టి బలిజల కోసం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటుచేసి, వారి సంక్షేమం కోసం రూ.105 కోట్లు ఖర్చు చేసింది. కల్లుగీత కార్మికులకు ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేశాం. మోపెడ్ లు, చెట్లు ఎక్కే యంత్రాలు కూడా అందించాం.
శెట్టి బలిజలకు ఆత్మగౌరవం ఎక్కువ. కష్టాన్ని నమ్ముకున్న వాళ్లు శెట్టి బలిజలు. ఎవరి నుండి సహాయం కోసం ఎదురు చూడకుండా సొంత కాళ్లపై నిలబడే వారు. ఉన్న దానిలో సాయం చేస్తారు. కొబ్బరి రైతులు, దింపు కార్మికులతో త్వరలోనే సమావేశం ఏర్పాటుచేసి సమస్యల పరిష్కారం కోసం భరోసా ఇస్తాను. ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి తాటి చెట్ల పెంపకం కోసం సహకారం అందిస్తాం.
మద్యం షాపుల్లో 20 శాతం కేటాయిస్తాం!
టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక శెట్టిబలిజ సోదరులను రాజకీయంగా మరింతగా ప్రోత్సహిస్తాం. సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. దామాషా ప్రకారం నిధులు కేటాయించి స్వయం ఉపాధి కోసం రుణాలు అందిస్తాం. మద్యం షాపుల్లో 20 శాతం కల్లుగీత కార్మికులకు కేటాయిస్తాం. జగన్ పాలనలో చెట్లపై నుండి పడిపోయి చనిపోయిన కల్లు గీత కార్మికుల కుటుంబాలకు టీడీపీ-జనసేన ప్రభుత్వ వచ్చిన వెంటనే సాయం అందిస్తాం.
ఎయిడెడ్ కళాశాలను జగన్ నాశనం చేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేస్తాం. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రభుత్వ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్ నేరుగా కాలేజీలకు చెల్లిస్తాం.
జె-బ్రాండ్లతో గీతకార్మికుల పొట్టగొట్టిన జగన్
జగన్ జే బ్రాండ్స్ అమ్ముకోవడానికి కల్లు గీత కార్మికుల పొట్ట కొట్టాడు. గీత కార్మికులపై ఎక్సైజ్ అధికారుల దాడులు పెరిగాయి. కల్లు గీత కార్మికులు చెట్ల మీద నుండి పడి చనిపోతే కనీసం వైసీపీ ప్రభుత్వం బీమా కూడా అందించడం లేదు. కల్లుగీత పాలసీ ప్రకటించింది టీడీపీ.కల్లు గీతని ప్రోత్సహించింది టీడీపీ. టీడీపీ హయాంలో మీకు ఎటువంటి వేధింపులు లేకుండా చేశాం. తాటిచెట్ల పెంపకం దగ్గర నుండి కల్లు అమ్మకం వరకూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా ప్రోత్సహించింది టీడీపీ.
ఉద్యోగాలివ్వడం అంటే... చేపల కొట్లు పెట్టించినంత ఈజీకాదు జగన్!
తాళ్లరేవులో ఓ ఫిష్ మార్టును సందర్శించిన సందర్భంగా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది తాళ్లరేవులో ఫిష్ ఆంధ్ర పేరుతో ఏర్పాటుచేసిన సర్కారు వారి చేపలు దుకాణం అని వ్యంగ్యం ప్రదర్శించారు.
"నిరుద్యోగ యువత ఉపాధి కోసం చంద్రబాబునాయుడు హెచ్ సీఎల్ లాంటి ఐటీ కంపెనీలు, కియాలాంటి భారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పిస్తే, చేతగాని ముఖ్యమంత్రి జగన్ డిగ్రీలు, పోస్టు గ్రాడ్యుయేషన్ చదివిన యువకులతో చేపల దుకాణాలు, మటన్ మార్టులు పెట్టించాడు. నాలుగున్నరేళ్లలో ఒక్క పరిశ్రమ రాకపోగా, జె-ట్యాక్స్ బెడద భరించలేక అమర్ రాజా, జాకీ, లులూ, ఫ్యాక్స్ కాన్ లాంటి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు పరారయ్యాయి. అభివృద్ధి చేయడమంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డంగా దోచుకునేంత ఈజీకాదు జగన్మోహన్ రెడ్డీ" అని స్పష్టం చేశారు.
====
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2926.4 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 21.5 కి.మీ.*
*214వరోజు (1-12-2023) యువగళం వివరాలు*
*కాకినాడ సిటీ/ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలు*
ఉదయం
8.00 – చొల్లంగిపేట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.15 – గురజనాపల్లి సెంటర్ వద్ద పాదయాత్ర కాకినాడ రూరల్ లోకి ప్రవేశం.
9.15 – కాకినాడ రూరల్ డ్రైవర్స్ కాలనీలో స్థానికులతో మాటామంతీ.
9.40 – కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
9.45 – కాకినాడ బాలయోగి విగ్రహం వద్ద డీప్ వాటర్ పోర్టు వర్కర్లతో సమావేశం.
10.00 – ఎంఎస్ ఎన్ చారిటీస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
10.30 – ఘాటీ సెంటర్ లో లారీ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ.
11.30 – సినిమారోడ్డులో వ్యాన్ యూనియన్ ప్రతినిధులతో సమావేశం.
11.35 – సాయిబాబా మార్కెట్ సెంటర్ లో డ్వాక్రా మహిళలు, ఉద్యోగులతో భేటీ.
11.40 – కామాక్షిదేవి గుడి వద్ద ఆగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం.
మధ్యాహ్నం
12.10 – కల్పన సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
12.20 – ఆనందభారతి గ్రౌండ్స్ గాంధీ విగ్రహం సెంటర్ లో మహిళలతో భేటీ.
12.25 – వైఎస్సార్ బ్రిడ్జి వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
12.55 – కోకిల సెంటర్ లో దివ్యాంగులతో సమావేశం.
1.25 – ఆర్ ఎంసి గ్రౌండ్స్ వద్ద భోజన విరామం.
సాయంత్రం
4.00 – ఆర్ ఎంసి గ్రౌండ్స్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.15 – ఓల్డ్ ఎస్పీ ఆఫీసు వద్ద యువతతో సమావేశం.
4.45 – నాగమల్లితోట జంక్షన్ లో విద్యార్థులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో భేటీ.
5.35 – కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రవేశం.
5.40 – సర్పవరం జంక్షన్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
రాత్రి
8.35 – యార్లగడ్డ గార్డెన్స్ విడిది కేంద్రంలో బస.
*****