Kalvakuntla Kavitha: తెలంగాణలో పోలింగ్ సరళిపై కల్వకుంట్ల కవిత స్పందన
- ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- గులాబీ విప్లవం కనిపించిందన్న కవిత
- 100 స్థానాలు ఖాయమని ధీమా
- కేసీఆర్ హ్యాట్రిక్ సాధించబోతున్నారని జోస్యం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక ఫలితాల వెల్లడి మిగిలుంది. డిసెంబరు 3తో పార్టీల తలరాతలు డిసైడ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో, ఇవాళ పోలింగ్ ముగిశాక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో గులాబీ విప్లవం కనిపించిందని, ఆ మేరకు వివిధ చోట్ల ఉన్న తమ పార్టీ కార్యాలయాలకు సమాచారం అందిందని తెలిపారు. 100 స్థానాలు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేసేవాళ్లే అధికారంలో ఉండాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేవాళ్లు ఉండరాదని ఓటర్లు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోందని అన్నారు.
తెలంగాణ సీఎంగా కేసీఆర్ గారు హ్యాట్రిక్ సాధించబోతున్నారని, ఇందులో ఎలాంటి సందేహం లేదని కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు భారీ ఎత్తున ఆశీర్వదించి, మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారని వివరించారు.
ఇదివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని చరిత్ర సృష్టించామని, ఇప్పుడు సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ తో మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని కవిత ధీమా వ్యక్తం చేశారు.